Telugu Global
National

25 లక్షల కొత్త కనెక్షన్లు.. BSNLకు మంచిరోజులు!

అప్పటి నుంచి BSNLకు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతినెలా సబ్‌స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకోవడం ఎరుగని BSNLకి ఇది శుభపరిణామమే.

25 లక్షల కొత్త కనెక్షన్లు.. BSNLకు మంచిరోజులు!
X

ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా రీఛార్జ్‌ రేట్లను పెంచడంతో ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వరంగ సంస్థ‌ అయిన BSNLపై పడింది. ప్రైవేట్ కంపెనీలతో పోలీస్తే BSNL ప్లాన్లు చాలా ఛీప్. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డేటా ప్లాన్‌ను 28 రోజులకు ప్రైవేటు టెలికాం కంపెనీలు రూ.189, 199 చొప్పున ఇస్తున్నాయి. BSNL మాత్రం సగం ధరకే అంటే రూ.108కే సేమ్ ప్లాన్ ఇస్తోంది. దీంతో BSNL కనెక్షన్‌ తీసుకొనేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. నెలవారీ కనీస ఛార్జీల ధరలూ పెరిగిన నేపథ్యంలో కేవలం ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కోసం ఫోన్లు వాడేవారు BSNL వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని విశ్లేషకుల అంచనా.

జూలై 3-4 తేదీల్లో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ రేట్లను భారీగా పెంచేశాయి. అప్పటి నుంచి BSNLకు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతినెలా సబ్‌స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకోవడం ఎరుగని BSNLకి ఇది శుభపరిణామమే. 2 వారాల్లో ఏకంగా రెండున్నర లక్షల మంది పోర్టబులిటీ ద్వారా ఇతర నెట్‌వర్కుల నుంచి BSNLకు మారారు. మరో 25 లక్షల మంది కొత్తగా BSNL కనెక్షన్ తీసుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ BSNL సిమ్‌కార్డు విక్రయ కేంద్రాల్లో సందడి కనిపిస్తోంది.

BSNLలో ఇప్పటికీ 4జీ సేవలు లేకపోవడం పెద్ద మైనస్‌. అయితే 4G సేవలను అందుబాటులోకి తేవడానికి టాటా గ్రూపు అధినేత రతన్‌ టాటా, BSNLతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. 15వేల కోట్ల రూపాయలతో ముందుగా వెయ్యి గ్రామాల్లో 4G సేవలను అందుబాటులోకి తెస్తారనే వార్తలు వస్తున్నాయి. 2016లో జియో ఎంట్రీతో టెలికాం రంగం పూర్తిగా దెబ్బతింది. ప్రైవేట్ కంపెనీల 4G స్పీడులో BSNL కొట్టుకుపోయింది. జియో మార్కెటింగ్ స్ట్రాటజీని ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు కూడా కుదేలయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో జియో పెంచిన ప్రతిసారి రేట్లు పెంచుతూ వస్తున్నాయి. దీంతో ప్రైవేట్ కంపెనీలపై జనం విసుగెత్తిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోBSNL రీఎంట్రీ అనేది అత్యవసరం. ఈ తరుణంలో BSNLలో టాటా పెట్టుబడుల వార్త జనాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

First Published:  18 July 2024 12:23 PM GMT
Next Story