పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులు సేఫ్
ప్రమాదానికి గల కారణాలను అన్వేషించగా.. ట్రాక్‌పై ఓ వస్తువును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 2.35 గంటల సమయంలో ఈ సంఘటన జరగగా, అప్పటికే నిద్రమత్తులో ఉన్న రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైలు తీవ్ర కుదుపులకు గురవుతుండటంతో ఏం జరుగుతోందోనని బెంబేలెత్తిపోతూ హాహాకారాలు చేశారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాణికుల పరిస్థితిపై ఆరా తీశారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను అన్వేషించగా.. ట్రాక్‌పై ఓ వస్తువును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఐబీ అధికారులు సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.
రైలు ఇంజిన్ ఢీకొన్న వస్తువును గుర్తించిన అధికారులు దాని ఆనవాళ్లను భద్రపరిచారు. మరోవైపు రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రయాణికులందరినీ మరో రైలులో గమ్యస్థానాలకు చేర్చింది. తరచుగా రైల్వేలో ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.