కేరళలోని వయనాడ్‌లో లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు శనివారం వెల్లడవుతున్నాయి. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఈ ఫలితాల్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రెండు లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి ఈ స్థానంలో పోటీలో ఉన్న విషయం విదితమే. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
వయనాడ్‌లో 2019లో లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజారిటీ రాహుల్‌గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన ఆయన సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.6 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వయనాడ్‌లో ఉప ఎన్నిక నవంబర్ 13, 2024న జరిగింది. ఈ పోటీలో కాంగ్రెస్‌కి చెందిన ప్రియాంక గాంధీ వాద్రాపై బీజేపీకి చెందిన నవ్య హరిదాస్ ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు గ్రామీణ మరియు పట్టణ ఓటర్లను ఆకర్షించడానికి యత్నించారు. అభివృద్ధి, క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించారు. ఇద్దరు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారంతో, ర్యాలీలు, డిజిటల్ ప్రచారం నిర్వహించారు.