ఢిల్లీ ముఖ్యమంత్రికి రూ.19.26 లక్షల విరాళాలు
ఎన్నికల్లో పోటీ కోసం విరాళాలు కోరిన ఆతిశీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం ఆతిశీకి రూ.19.26 లక్షల విరాళాలు వచ్చాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.40 లక్షలు కావాలని, అంత డబ్బు తన వద్ద లేనందున విరాళాలు ఇవ్వాలని ఆమె ఆన్‌లైన్ లో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. ప్రజలు విరాళాలు ఇచ్చేందుకు ఒక ఆన్‌లైన్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఒక్కరోజులోనే ఆతిశీకి 443 మంది వ్యక్తులు రూ.19.26 లక్షలు విరాళంగా అందజేశారు. ఢిల్లీలోని కాల్‌కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఆప్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. మొదట కాల్‌కాజీ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత నామినేషన్ వేస్తానని ఆతిశీ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఇదే అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున రమేశ్ బిధూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లంబా పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనుండగా అదేనెల 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఆప్ ను గద్దెదించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ శతవిధాల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు. ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది.