Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    మృణాల్ సేన్ వార్తా కథనం ‘చల్ చిత్రో’ రివ్యూ!

    By Telugu GlobalJanuary 7, 20236 Mins Read
    మృణాల్ సేన్ వార్తా కథనం ‘చల్ చిత్రో’ రివ్యూ!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏటా నవంబర్ – డిసెంబర్ మాసాల్లో ఢిల్లీ నగర వాసులు వూపిరాడక ఉక్కిరిబిక్కిరై పోతారు. ఇదేదో సస్పెన్స్ సినిమాలు చూస్తూ కాదు. జీవితాలే సస్పెన్స్ లో పడి. భయంకర కారు మేఘాలు వాళ్ళని చుట్టు ముట్టేస్తాయి. వూపిరాడక ఏమిటీ జీవితమని సస్పెన్స్ థ్రిల్లర్ అనుభవిస్తారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని చూపించేది అటు ఓ ఇరవై లక్షల మంది రైతు భయ్యాలు. వాళ్ళు చేయీ చేయీ కలిపి హైలెస్సా అని, ఓ రెండున్నర కోట్ల టన్నులు మాత్రమే తమ ప్రియమైన పంట వ్యర్ధాల్ని పొరుగున పంజాబ్ లో, హర్యానాలో శక్తివంచన లేకుండా తగులబెడతారు. దాన్ని ఢిల్లీ మీదికి గురిపెట్టి దట్టమైన పొగ మేఘాలుగా తోలేసి, పట్టపగలే కారు చీకట్లు చూపిస్తారు. ఇంకా ఇది చాలనట్టు వాహన, పారిశ్రామిక, భవన నిర్మాణ పొగా – ధూళీ తోడై కాక్ టెయిల్ డయాక్సైడ్ లుగా, వాయు గరళం ప్రజల ముక్కు పుటాల్లోకి గిలిగింతలు పెడుతూ దూరిపోవడం అదనపు హార్రర్ థ్రిల్లర్.

    న్యూవేవ్ సినిమా సారధుల్లో ఒకరైన మృణాల్ సేన్ (1923 -2018) మార్క్సిస్టు భావజాలంతో బెంగాలీ సమాంతర సినిమాలు తీస్తూ పోయారు. తెలుగులో కూడా ‘ఒక వూరి కథ’ (1977) తీశారు. దీనికి ఉత్తమ జాతీయ చలన చిత్ర అవార్డుతో బాటు, మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన కథ ‘కఫన్’ ఆధారంగా తీశారు. సేన్ 1955 – 2002 ల మధ్య మొత్తం 26 సమాంతర సినిమాలు తీశారు. వీటిలో మూడు హిందీ కూడా వున్నాయి. పద్మభూషణ్ మృణాల్ సేన్ తను తీసిన సినిమాలకి 18 జాతీయ, 12 అంతర్జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులూ పొందారు. ఆయన సతీమణి గీతా సేన్ ప్రముఖ నటి కూడా. ‘మృగయా’ లో సేన్ పరిచయం చేసిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే.

    మృణాల్ సేన్ మీద యూరప్ సినిమాల ప్రభావముందని చెబుతారు. సర్రియలిజం, పోస్ట్ మోడర్నిజం, నియో రియాలిజం, నూవెల్ వేగ్, జర్మన్ ఎక్స్ ప్రెషనిజం మొదలైన యూరప్ సినిమా కళల్ని ఆయన అనుసరించినట్టు ఉల్లేఖనాలున్నాయి ( జర్మన్ ఎక్స్ ప్రెషనిజంని ఫిలిం నోయర్ కళగా మార్చుకుని 1940 ల నుంచీ హాలీవుడ్ థ్రిల్లర్లు తీస్తూ వచ్చింది కూడా). ఆయన మేకింగ్ లో ఒక వైవిధ్యాన్ని చూడొచ్చు. ఆయన ప్రేక్షకుల్ని శాసించరు, చెప్పే విషయం మీద తీర్పులివ్వరు. ముగింపుల్ని ప్రేక్షకుల వూహకే వదిలేస్తారు.

    1981 లో సేన్ దర్శకత్వం వహించిన ‘చల్ చిత్రో’ (కెలిడియో స్కోప్ – వర్ణ కదంబిని) ముగింపుని అలా జడ్జి చేయకుండా ప్రేక్షకుల ఆలోచనకి వదిలేస్తారు. రంగుల్లో చూపించిన ఈ కుటుంబ జీవన దర్శిని నగరం మీద వ్యాఖ్యానం చేస్తుంది. నగరాల్లో కుటుంబాల్ని చూస్తే నగరం అర్ధమైపోతుంది. నగర ఆత్మ కుటుంబాల్లోనే – ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో వుంటుంది, చారిత్రక కట్టడాల్లో కాదు. అదే సమయంలో మధ్యతరగతి కుటుంబాలు నగరాన్ని హైజాక్ కూడా చేయవచ్చు. తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఎలా? ఎలా చూపించారో సేన్ చూద్దాం…

    కథ

    దీపూ (అంజాన్ దత్) కి తల్లీ, తమ్ముడూ వుంటారు. పదిళ్ళ చావిడిలో నివాసం. రేపోమాపో కుప్ప కూలేట్టున్న పురాతన భవనం. అసలే కలకత్తా డెడ్ సిటీగా పేరుబడింది. పేరుకే భవనం గానీ లోపల చూస్తే మురికి వాడల కన్నా అధ్వాన్నం. ఆడవాళ్ళందరూ వాకిట్లోనే అంట్లు తోముతారు, బట్టలు ఉతుకుతారు. శుచీ శుభ్రత ఏమీ వుండదు. గచ్చంతా నాచు పట్టి వుంటుంది. దీపూ తల్లి (గీతా సేన్) గబగబా వస్తూ బుడుంగున జారిపడుతుంది. కలకలం లేస్తుంది. నువ్వంటే నువ్వని నిందించుకుంటారు. రోజూ గంజి పారబోస్తున్నదెవరని తగువులాడుకుంటారు.

    కల్పనా టీచర్ రోజూ చీరలకి గంజి పెడుతోందని తెలుసుకుని ఆమె మీదికి పోతారు. “రోజూ గంజే పెట్టుకుంటాను, ఏం చేస్తారు? నేను స్కూలుకి పోయేదాన్ని” అని కౌంటర్ ఇస్తుంది కొత్త కడక్ ఇస్త్రీ చీరలో ఠీవీగా వున్న యంగ్ టీచర్ కల్పన. ఇలా లాభంలేదని, పనిమనిషే గచ్చు సరిగా కడగడం లేదని తీర్మానించుకుని తామే కడగడం మొదలెడతారు. రుద్ది రుద్ది కడుగుతారు, గీకి గీకి కడుగుతారు. ఒక లయబద్ధంగా ట్యూనప్ అయి, పల్లెపడుచులు పాటలతో వరినాట్లు వేస్తున్నట్టే దృశ్యాన్ని రక్తి కట్టిస్తారు (ఈ కార్మిక శక్తిని సేన్ కళాత్మకంగా ఓ రెండు నిమిషాలపాటు టైము తీసుకుని సుదీర్ఘంగా కమ్యూనిజంలా చూపిస్తారు).

    ఇందులో కథేమైనా దొరుకుతుందాని పొంచి చూస్తూంటాడు దీపూ. అతడికి అర్జెంటుగా ఒక కథ కావాలి. మధ్యతరగతి జీవితాల మీద. ఈ చావిడిలో బోలెడు కథలుంటాయి. ఎల్లుండి కల్లా కథ పట్టుకుని రెడీ చేసేయాలి. మనింటి నుంచే మొదలెడదామని తల్లి వెంట తిరుగుతూంటాడు. ఆమె నిప్పుల కుంపటి మీద వంట చేస్తూంటే, గ్యాస్ కొనుక్కోకుండా ఇంకెన్నాళ్ళు ఈ పాట్లని మందలిస్తాడు. రాత్రి దోమలు దాడి చేస్తూంటే మందు కొడుతూ గడుపుతాడు. తమ్ముడు కిటికీ లోంచి చూస్తే, ఇవ్వాళ్ళో రేపో బాల్చీ తన్నేసేట్టున్న ముసలమ్మ, బొగ్గు చోరీ చేసి ఎస్కేప్ అవుతూంటుంది. ఇది దీపూ కి చెప్తాడు తమ్ముడు. చోరీ చేస్తూంటే ఎందుకు అరవలేదని దీపూ అంటాడు. నిజానికి తనూ ఇది చూశాడు. ఆమె మనల్ని చూడలేదంటాడు తమ్ముడు. మనం ఆమెని చూశామంటాడు దీపూ. తల్లిని లేపి చెప్తారు. ముసిల్దాన్ని వదిలేసినందుకు ఇద్దర్నీ క్లాసు పీకుతుంది.

    తెల్లారి చావిడి కానుకుని వున్న కొత్త మేడలోకి దట్టంగా పొగ వచ్చేస్తూంటే, కిటికీలోంచి చూసి కేకలేస్తుందొక నవయువతి. ఆమెని ఎవరూ పట్టించుకోరు. చావిడి మహిళా శక్తి బొగ్గు కుంపట్లు రాజేసి వంటా వార్పూతో పొగ రేగ్గొడుతూ బిజీగా వుంటారు. ఆ పొగ మేడలో గోడకున్న సత్యసాయిబాబా ఫోటోని కూడా ధూపంలా కమ్మేస్తుంది (మార్క్సిస్టు సేన్ సత్య సాయి ఫోటోని అప్పప్పుడు సడెన్ షాట్ గా మధ్యలో ఇన్సర్ట్ చేసి తీసేస్తూంటారు).

    ఇక ఆడవాళ్ళు ఒకచోట చేరి అంట్లు తోమే కార్యక్రమం మొదలెడతారు. ముసలమ్మ స్మగ్లింగ్ ని అడ్డుకోవాలని దీపూ తల్లి బొగ్గు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. దీపూ కలకత్తా నగరంలోకి పోతాడు. సాయంత్రానికల్లా మేడ మీది నవయువతి భారీ ఎత్తున కాగితాల్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, చావిట్లోకి విసిరేయడం మొదలెడుతుంది. వాకిట్లో చెత్తంతా నిండిపోయి హాహాకారాలు లేస్తాయి. వర్గపోరాటం. దీపూ నగరంలో తిరిగి తిరిగి వచ్చి రాయడానికి ప్రయత్నిస్తాడు. స్మోక్ చేస్తూ యాష్ ట్రే శుభ్రం చేసిమ్మంటాడు తల్లితో. ఆమె శుభ్రం చేసిస్తుంది. కానీ రాయబోతే కథ రాదు.

    ఇంతలో పక్కింటామెకి నొప్పులు మొదలవుతాయి. దీపూ ఆమె భర్తా టాక్సీకోసం పరిగెడతారు. టాక్సీ ఎక్కడా దొరకదు. కొడుకు పుట్టాడని చావిట్లో ఒక ముత్తైదువ శంఖం పూరిస్తుంది. టాక్సీ కోసం తిరుగుతున్న దీపూకి జ్యోతిష్యుడు దొరుకుతాడు విదేశీ అమ్మాయి చేయి చూస్తూ. ఇతడి కథ తీసుకుందామని అతడి వెంట మురికి కూపం లాంటి ఇంటికి పోతాడు.

    ఇటు చావిడికి స్టీలు సామానువాళ్ళు వస్తే పాత బట్టలేసి పళ్ళెం కొంటుంది దీపూ తల్లి. తర్వాత తన బట్టల్లో కొత్త ప్యాంటు లేకపోవడం చూసి చిందులేస్తాడు. ప్యాంటు కంటే పళ్ళెం ఎంత ముద్దోస్తోందో చూడమని చూపిస్తుంది. ఇక ఈ కుటుంబాల్లో కథ రాదని తలపట్టుకుంటాడు. గడువు దగ్గర పడుతోంది. మర్నాడు తెల్లారి డాబా ఎక్కి నగరాన్ని విహంగ వీక్షణం చేస్తూంటాడు. పెంకుటిళ్ళ సమూహం నుంచి దట్టంగా కుంపట్ల పొగలు.

    నగరంలో ఎన్ని కుంపట్లుంటాయని తమ్ముడు అడుగుతాడు. బొగ్గు ధర పెరుగుతున్నా కుంపట్లే వాడుతున్నారనీ అంటాడు దీపూ. ఆ పొగే పీలుస్తారని తమ్ముడంటాడు. పోగా, విషమా అని దీపూ అంటాడు. వీళ్ళు గ్యాస్ కొనగలరు, కానీ కొనరంటాడు… పెంకుటిళ్ళు అలాగే పొగలు గక్కుతూంటాయి… ఇదీ కథ.

    వార్తే ఆర్టు

    వ్యంగ్యంగా తీసిన ఈ నగర కథ మొదలయింది కుటుంబ కథ కోసం. ముఖ్య పాత్ర దారులు ఇద్దరే. కొడుకు పాత్రలో అంజాన్ దత్, తల్లి పాత్రలో గీతా సేన్. అత్యంత సహజ నటనలు. అన్నిటితో రాజీ పడుతూ జీవనం సాగించే మధ్య తరగతి కుటుంబాల వాతావరణంలో అచ్చం అలాటి మనుషులే అన్నట్టు ఇమిడిపోయిన నటులు. 1970 లలో సేన్ చూపించిన ఇరుకు చావిడీ లో ఈ జీవితాలు ఒక విధంగా మురికి వాడల జీవితాలకేం తీసిపోవు. ఆర్ట్ సినిమాలంటే ఇండియాని ఇలాగే చూపించాలేమో అన్నట్టు ఒక టెంప్లెట్ ఏర్పడిపోయింది… సత్యజిత్ రే సహా చాలామంది ఆర్ట్ సినిమా దర్శకులు ఇదే పని చేశారు. ఇండియా అంటే మురికి వాడల పేదరికపు దేశమని. విదేశాల్లో వీటికే ఎగబడి అవార్డులిచ్చారు. అంతర్జాతీయంగా ఇండియాని ఇలాగే బ్రాండింగ్ చేసి పగ ఏదో తీర్చుకోవాలన్నట్టు. బహుశా ఇంకే దేశం తమ దేశాన్ని ఇలా చూపించలేదు. ఆ మధ్య ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ లో బ్రిటష్ దర్శకుడు డానీ బాయిల్ ఇండియాని ఇలాగే చూపిస్తే దేశంలో విమర్శలు చెలరేగాయి.

    అలోక్ నాథ్ డే సంగీతం వహిస్తే, కేకే మహాజన్ ఛాయాగ్రహణం సమకూర్చాడు. సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో వుంది. సేన్ ఈ వ్యంగ్య కళా రూపంతో ఒకటి ప్రతిపాదింప దల్చారు : ఆర్ట్ సినిమా వార్తా కథనం కూడా చేస్తుందని. కమర్షియల్ సినిమా ఇది చేస్తే బావుండదు. వార్తా కథనం డాక్యుమెంటరీ అవకుండా చూసుకోవడమే సేన్ చూపెట్టిన వ్యత్యాసం. అయితే ముందు చెప్పుకున్నట్టు ఆయన న్యూస్ ఇస్తారు, తన వ్యూస్ చెప్పరు. పరిస్థితిని రిపోర్టింగ్ చేసి వదిలేస్తారు, సమాచారాన్ని ఇస్తారు. ఇక ప్రేక్షకులే జడ్జి చేసుకోవాలి. బాధ్యత గ్రహించాలి. మరి ఇంతకీ దీని ద్వారా ప్రేక్షకులకి అందే సమాచార మేమిటి? ఇది చూద్దాం…

    దొరికింది కథ

    ఎంతకీ కథ దొరకని దీపూకి తమ్ముడి ప్రశ్న ఆలోచనలో పడేస్తుంది. నగరంలో ఎన్ని కుంపట్లుంటాయన్న ప్రశ్న. దీంతో అయిడియా వస్తుంది. ఇక ‘ఇళ్ళల్లో కుంపట్ల వల్ల నగరంలో వాయు కాలుష్యం’ గురించి రాయాలనుకుంటూ.

    శ్వేత భవనంలో పత్రికా ఎడిటర్ కి హెచ్చరిక లొచ్చాయి – బయటికి రావద్దని. బయట ఆడవాళ్ళు భవనాన్ని ముట్టడిస్తున్నారని. అర్ధరాత్రి ఎర్రగా మండుతున్న కుంపట్లు పట్టుకుని, చీపురు కట్టలు చేబూని ఆడవాళ్ళూ వచ్చేస్తున్నారు. సమాచారమందుకుని పోలీసులు వచ్చేశారు. ఆడవాళ్లు ఆగడం లేదు. పోలీసులు ఎమర్జెన్సీ కాల్స్ చేసి ఆదేశాలు పొందారు. ఆడవాళ్ళని ముందుకు రావద్దని హెచ్చరికలు చేశారు. గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా ఆగడం లేదు. స్కూలు పిల్లలు కూడా వచ్చేసి ఆడవాళ్ళతో కలిశారు. సమూహం పెరిగింది. పరిస్థితి చేయి దాటుతోంది. పోలీసులు మరో కాల్ చేశారు. ఫైరింజ న్లు వచ్చేశాయి. నీటిని చిమ్మాయి, చెల్లా చెదురు చేశాయి. కుంపట్లని ఆర్పేశాయి.

    ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు దీపూ. ఇదేమిటి ఇలాటి కల వచ్చింది? అయితే ఎడిటర్ కి ఇదే చెప్పి జర్నలిస్టు ఉద్యోగం కొట్టేయాలి. ఉదయం పత్రికాఫీసుకి వెళ్ళాడు. స్టోరీ వచ్చేసిందని ఎడిటర్ (ఉత్పల్ దత్) కి చెప్పాడు. నగరంలో కుంపట్ల సమస్య గురించి చెప్పాడు. అవి సృష్టిస్తున్న వాయుకాలుష్యం గురించి చెప్పాడు. ప్రజారోగ్యం దృష్ట్యా దీన్నాపాలన్నాడు. దీర్ఘాలోచన చేసి, “కాలుష్యం గ్లోబల్ సమస్య” అన్నాడు ఎడిటర్. “బొగ్గు వాడకాన్ని ఎలా నివారించగలం?” అన్నాడు.

    “1905 లో బ్రిటిష్ ప్రభుత్వం స్మోక్ న్యూసెన్స్ యాక్టు తీసు కొచ్చిందబ్బాయ్. అప్పుడిలా వంట చేస్తారని వూహించలేదు. స్మోక్ ఈజ్ పాజిటివ్ న్యూసెన్స్. ఇప్పుడా లోచించాల్సిందే” అన్నాడు.

    “మరి వంటలెలా చేస్తారు సార్? నగరమంతా కుంపట్లే కదా?”

    “నగరం వరకే ఎందుకు చూస్తావ్, మొత్తం దేశాన్నేచూడాలి. నీకు జాబిచ్చేశాను పో” అనేస్తాడు ఎడిటర్. సంతోషంగా వెళ్ళిపోతాడు దీపూ. పోతూపోతూ ఒక గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ కొనుక్కుని ఇంటికి పోతాడు…

    ఇక రైతు భయ్యాల ‘కుంపట్లు’ నుంచి ఢిల్లీ విముక్తే మిగిలింది. మొత్తం దేశాన్నే చూడాలన్న ఎడిటర్, ఆడవాళ్ళు పోయి ఇలా రైతులు వస్తారని వూహించి వుండడు. ఆనాడు 1905 స్మోక్ న్యూసెన్స్ యాక్టు ఇది వూహించనట్టే. ఇదీ మృణాల్ సేన్ భవిష్య దర్శనం చేసిన సృష్టి!

    Chaalchitra Mrinal Sen
    Previous Articleకృష్ణా జలాల్లో 50 శాతం నీటివాటా కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వం
    Next Article తరువులు నా గురువులు (కవిత)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.