వై నాట్..? - ఏపీలోకి ఎంట్రీపై మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు
కర్నాటక, మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాల్లోనే విస్తరిస్తున్నప్పుడు తెలుగువాళ్లు ఉంటే ఏపీలో ఎందుకు విస్తరించకుండా ఉంటామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
చాయ్‌వాలా ప్రధాని అవగా లేనిది.. కేసీఆర్ అయితే తప్పా అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్. చాయ్‌వాలా ప్రధానై చివరకు చాయ్ అమ్ముకునేవారూ బతకలేని పరిస్థితి వచ్చేస్థాయిలో ప్రైవేటీకరణ జరిగిపోతోందని విమర్శించారు. శక్తిసామర్థ్యాలుంటే, ప్రజలు అదరిస్తే ఎవరైనా ఈ దేశంలో ప్రధాని కావొచ్చన్నారు.
బలం ఉంది కదాని రాష్ట్రాలపై ఇష్టానుసారం చట్టాలను రుద్దుతూ, విద్యుత్ చట్టాలను తెస్తూ గొంతులో విషం పోసి చంపుతున్నారని మోడీపై పువ్వాడ విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ అనేది ఒకరికి శత్రు పక్షంగా, మరొకరికి మిత్ర పక్షంగా ఆవిర్భవించలేదని.. ప్రతి రాష్ట్రంలోనూ తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్నారు. దేశానికి, ప్రజలకు కావాల్సిన రాజకీయాలే చేస్తామన్నారు.
కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకెళ్తామన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాల్లోనే విస్తరిస్తున్నప్పుడు తెలుగువాళ్లు ఉంటే ఏపీలో ఎందుకు విస్తరించకుండా ఉంటామని ప్రశ్నించారు. ఏపీలోనూ బీఆర్‌ఎస్‌ను విస్తరిస్తామన్నారు.