Telugu Global
NEWS

మరోవారం అతి భారీ వర్షాలు

22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.

మరోవారం అతి భారీ వర్షాలు
X

తెలుగు రాష్ట్రాల్లో మరో వారం వ‌ర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 23వ తేదీ వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జనం అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.

ఈనెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ఈనెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉద‌యం నుంచే ఆకాశం మేఘావృత‌మై కనిపించింది. నగర ప‌రిధిలోని మియాపూర్, చందాన‌గ‌ర్, శేరిలింగంప‌ల్లి, మేడ్చల్, కండ్లకోయ‌, దుండిగ‌ల్, గండిమైస‌మ్మ ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. ఉమ్మడి మెద‌క్ జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసింది. సంగారెడ్డిలో ఉరుములు, మెరుపుల‌తో వాన దంచికొట్టింది. ప‌టాన్‌చెరులో కుండ‌పోత వ‌ర్షం కురిసింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, న‌ల్లగొండ‌, సూర్యాపేట‌, వికారాబాద్, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ హెచ్చరించింది.

First Published:  18 May 2024 4:35 PM IST
Next Story