Telugu Global
NEWS

ఆస్కార్ రేసులో 2018 మూవీ!

అమీర్‌ఖాన్‌ లగాన్‌ సినిమా తర్వాత ఏ భారతీయ సినిమా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ రేసులో చివరి వరకూ నిలవలేదు.

ఆస్కార్ రేసులో 2018 మూవీ!
X

మలయాళం సూపర్‌హిట్‌ మూవీ 2018... ఆస్కార్-2024 అవార్డుల కోసం అధికారికంగా ఎంపికైంది. వచ్చే ఏడాది అందించే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషల్ ఫీచర్‌ ఫిల్మ్ కేటగిరిలో ఈ మూవీని ఎంపిక చేశారు. టొవినో థామస్‌ ప్రధాన పాత్రలో.. జూడ్‌ అంథాని జోసెఫ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. కుంచకో బోబన్, తన్వీ రామ్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రాసిన కథతో ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ను రూపొందించారు. మలయాళంతో పాటు.. ఇతర భాషల సినీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా కన్నీళ్లు పెట్టించింది. బాక్సాఫీస్‌ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఏటా వివిధ దేశాలు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో తమ చిత్రాలను అకాడమీకి పంపుతాయి. ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షించింది. మొత్తం 22 సినిమాలు ఈ కేటగిరీలో పోటిపడ్డాయి. ది కేరళ స్టోరీ-హిందీ, రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్ కహాని, మిసెస్‌ ఛటర్జీ వర్సె నార్వే, బలగం-తెలుగు, వాల్వి-మరాఠి, బాప్లియోక్-మరాఠి, ఆగస్టు 16,1947 తమిళ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సినిమాలన్ని చూసిన కమిటీ.. చివరకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి కోసం 2018 సినిమాను ఎంపిక చేసింది.

అమీర్‌ఖాన్‌ లగాన్‌ సినిమా తర్వాత ఏ భారతీయ సినిమా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ రేసులో చివరి వరకూ నిలవలేదు. అంతకుముందు మదర్ ఇండియా, సలామ్‌ బాంబే చిత్రాలు మాత్రమే ఈ కేటగిరిలో పోటీపడ్డాయి.

First Published:  27 Sept 2023 10:21 AM GMT
Next Story