Telugu Global
NEWS

కేటీఆర్‌ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా?

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్‌ లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ప్ర‌ధాని మోడీ.. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం ఎందుకు సానుభూతి చూపటంలేదని నిలదీశారు.

కేటీఆర్‌ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా?
X

ఏదో ముతకసామెతలో చెప్పినట్లు ఏపీలోని రాజకీయ పార్టీల చేతకానితనాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అడ్వాంటేజ్‌గా మార్చుకుంటున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ప్ర‌ధానిమోడీ.. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం ఎందుకు సానుభూతి చూపటంలేదని నిలదీశారు. కార్పొరేట్ మిత్రులకు స్టీల్ ఫ్యాక్టరీని కట్టబెట్టే ప్రయత్నాలను మానాలని మోడీకి కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. వర్కింగ్ క్యాపిటల్‌తో పాటు ముడిసరుకు సరఫరాకు కూడా కేంద్రం ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇప్పుడు కేటీఆర్‌ చేసిన సూచనలు, హెచ్చరికల్లో కొత్తవేమీలేవు. ఇవే సూచనలు, హెచ్చరికలను వామపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్నవే. అయితే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల అధినేతలు నోళ్ళు మెదపటంలేదు. ఏదో మొహమాటం కొద్దీ జనాల కోసమని తమనేతలతో అప్పుడప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించేయాలని డిసైడ్ చేసింది వాస్తవం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం దాదాపు లేదు.

ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేయాలి. అయితే వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా వీళ్ళద్దరు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. ఏదో అప్పుడప్పుడు సన్నాయినొక్కులు నొక్కుతున్నారంతే. అందుకనే వీళ్ళను మోడీ ఏమాత్రం లెక్కచేయటంలేదు. సరిగ్గా ఈ పరిస్థితినే కేటీఆర్‌ అడ్వాంటేజ్ తీసుకున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి జగన్, చంద్రబాబు రాయాల్సిన లేఖను కేటీఆర్‌ రాశారు.

కేటీఆర్‌ ఆలోచనలు చూస్తుంటే తొందరలోనే విశాఖపట్నంలో పెద్దఎత్తున ఆందోళనకు పిలుపిచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది సెంటిమెంటుతో కూడినది. ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్, చంద్రబాబు చేయాల్సినంత చేయటంలేదనే అభిప్రాయం ఇప్పటికే జనాల్లో బాగా నాటుకుపోయింది. ఈ సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌ గనుక ఆందోళనలు, ఉద్యమాలంటే జనాలంతా మద్దతుగా నిలబడే అవకాశముంది. పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకున్నాకే వైజాగ్ స్టీల్‌కు మద్దతుగా కేటీఆర్‌ రంగంలోకి దిగినట్లు అర్థ‌మవుతోంది.

First Published:  3 April 2023 6:08 AM GMT
Next Story