Telugu Global
NEWS

ఈ సారైనా విభజన సమస్యలు కొలిక్కి వస్తాయా? 27న కీలక సమావేశం

హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జ‌రిగే ఈ సమావేశంలో పాల్గొనాల‌ని ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు చైర్మన్, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి.

ఈ సారైనా విభజన సమస్యలు కొలిక్కి వస్తాయా? 27న కీలక సమావేశం
X

ఏపీ, తెలంగాణ విడిపోయి ఎనిమిదేళ్ల గడిచిపోయినా ఇంకా పలు సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలోని పలు అంశాలు పెండింగ్‌లో ఉండటంతో.. వాటిని పరిష్కరించాలని పలు మార్లు ఇరు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి సంబంధించిన ఆస్తుల పంపకంపై ఇరు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 6వేల కోట్లకు పైగా విద్యుత్ బాకీలు రావల్సి ఉందని ఏపీ కేంద్రానికి లేఖ రాసింది. ఆ వెంటనే సదరు మొత్తాన్ని 30 రోజుల్లో చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయం సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. తెలంగాణ కాదు బాకీ పడింది.. ఏపీనే రూ. 17వేల కోట్లకు పైగా తెలంగాణకు చెల్లించాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టులో తెలంగాణకు వాటా ఉందని, ఆ విషయాన్ని కూడా తేల్చాలని కోరారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించిన సమస్య కూడా పెండింగ్‌లో ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక పరమైన అంశాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 27న కేంద్ర హోం శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది.

హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జ‌రిగే ఈ సమావేశంలో పాల్గొనాల‌ని ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు చైర్మన్, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహా విద్య, రైల్వే, పెట్రోలియం శాఖలతో పాటు 9 శాఖల అధికారులను ఈ భేటీకి ఆహ్వానించారు. ఏపీ ఫైనాన్స్ శాఖకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అంశం కూడా చర్చకు రానుంది.

సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ సంస్థలకు సంబంధించిన పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చ జరుగనుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. కొత్త రాజధానికి ఇవ్వాల్సిన నిధుల విషయంపై కీలకమైన చర్చ జరుగనుంది. అయితే ఏపీ ప్రభుత్వం 3 రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. కేంద్ర హోం శాఖ మాత్రం ఒక రాజధానిగానే పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఏపీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చే అవకాశంగా ఉంది. ఈ విషయంలో ఏపీ అధికారులు కేంద్రానికి ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  13 Sept 2022 5:36 PM IST
Next Story