Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    ‘కాంతార’ రివ్యూ {4/5}

    By Telugu GlobalOctober 15, 20225 Mins Read
    'కాంతార' రివ్యూ {4/5}
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    చిత్రం: కాంతార

    రచన – దర్శకత్వం : రిషభ్ శెట్టి

    తారాగణం : రిషభ్ శెట్టి, సప్తమీ గౌడ, కిషోర్, ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, ఉగ్రం రవి తదితరులు

    సంగీతం : అజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం : అరవింద్ కశ్యప్

    నిర్మాణం : హొంబాళే ఫిల్మ్స్‌

    పంపిణీ : (తెలుగు) గీతా ఆర్ట్స్

    నిర్మాత : విజయ్ కిరగందూర్

    విడుదల : అక్టోబర్ 15, 2022

    రేటింగ్ : 4/5

    సెప్టెంబర్ 30 న విడుదలైన ‘కాంతార’ కన్నడ ఒరిజినల్ రికార్డు స్థాయి వసూళ్ళని రాబడుతూ దూసుకెళ్తోంది. అక్టోబర్ 14 న విడుదలైన హిందీ వెర్షన్ కూడా సంచలనం సృష్టిస్తోంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన కన్నడ ఒరిజినల్ బాక్సాఫీసు 70 కోట్లు దాటేసింది. గత ఐదేళ్ళుగా కన్నడ సినిమాల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళుతున్న శెట్టి సోదరుల (రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ శెట్టి) భావజాలాన్ని ఇటీవల ‘చార్లీ 777’, ‘గరుడ గమన వృషభ వాహన’, ఇప్పుడు ‘కాంతార’ చాటుతున్నాయి. కన్నడ ప్రజల బ్రతుకు నుంచే కథలు తీసుకుని కన్నడ అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రాంతీయాభిమానంతో కమర్షియల్ సినిమాలకిదో కొత్త నమూనా.

    నటుడు, రచయిత, దర్శకుడు అయిన రిషభ్ శెట్టి ఈసారి కన్నడ సంస్కృతిని పర్యావరణ పరిరక్షణతో ముడిపెట్టి అద్భుత దృశ్య వైభవాన్ని సృష్టించాడు. కన్నడలో ఉడిపి కేంద్రంగా ఉపప్రాంతీయ సినిమారంగం అయిన తుళువుడ్ నుంచి అభయసింహా తీసిన మత్స్యకారుల జీవన చిత్రం ‘పడ్డాయి’ లో కన్నడ సంస్కృతిని జోడించి ఓ దృశ్య కావ్యాన్ని సృష్టించాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా. రిషభ్ శెట్టి కమర్షియల్ సినిమా తీశాడు. కేజీఎఫ్‌ రెండు భాగాలతో ప్రఖ్యాతి గాంచిన హోంబళే ఫిల్మ్స్ సంస్థ ‘కాంతార’ తో మరో ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అసలు ‘కాంతార’ లో వున్నదేమిటి, దీన్నెందుకు తప్పకుండా చూడాలి అనే అంశాలు పరిశీలిద్దాం..

    కథ

    1846లో ఓ దక్షిణ రాజు మనశ్శాంతి లేక అడవిలో తిరుగుతున్నప్పుడు కనిపించిన ఓ శిల ప్రశాంతతని చేకూరుస్తుంది. అది గిరిజనులు పూజించే దైవమహిమగల శిల. దాన్ని అడుగుతాడు. దాని బదులు వాళ్ళకి చాలా భూమిని దానమిస్తాడు. 1970 లలో ఆ రాజు వంశస్థుడు ఆ భూమిని క్లెయిమ్ చేస్తూ వస్తాడు. కోర్టు కెళ్తాడు. కోర్టు గుమ్మంలోనే రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. ఇదంతా ఆ శిలలో దాగున్న భూత కోలా మహిమ అనుకుంటారు. గిరిజనులు పూర్వం నుంచీ ప్రతీ యేటా భూత కోలా పండుగ జరుపుకుంటూ వుంటారు. దాన్ని కోలం అంటారు.

    1990 లలో ప్రస్తుత కథా కాలానికొస్తే, ఆ గిరిజన గ్రామానికి భూస్వామి దేవేంద్ర (అచ్యుత్ కుమార్) అండగా వుంటాడు. దొరగా గిరిజనుల సంక్షేమం చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అతడికి సహాయంగా శివ(రిషభ్ శెట్టి) వుంటాడు. ఫారెస్ట్ గార్డు ట్రైనింగు పూర్తి చేసుకుని వచ్చి అక్కడే ఉద్యోగంలో చేరిన లీల(సప్తమీ గౌడ) ని ప్రేమిస్తూంటాడు.

    ఈ ప్రాంతానికి ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చిన మురళీ(కిశోర్) కొన్ని చర్యలు చేపడతాడు. గ్రామస్థులు అడవిని పాడు చేస్తున్నారనీ, గ్రామానికి కంచె వేయడం ప్రారంభిస్తాడు. దీన్ని శివ అడ్డుకుంటాడు. వందల సంవత్సరాలుగా ఇక్కడి పౌరులమైన తాము అడవి అందించే ప్రతిదాన్నీ అనుభవించడానికి అర్హులమని వాదిస్తాడు. ఈ వివాదం పెరిగి పెరిగి ఘర్షణకి దారి తీసి, ఫారెస్ట్ ఆఫీసర్ మీద హత్యాయత్నం కేసులో ఇరుక్కుని తప్పించుకుంటాడు శివ.

    ఇప్పుడు శివ ఈ కేసులోంచి ఎలా బయటపడ్డాడు? మొత్తం గ్రామాన్నే కాజేసే ఇంకా పెద్ద కుట్రని ఎలా ఎదుర్కొన్నాడు? దేవుడు భూత కోలా పాత్రేమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు? చివరికి శివ ఏమయ్యాడు? ఈ ప్రశ్నకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

    ఎలావుంది కథ

    జానపద సాహిత్యాన్ని వాడుకుని ఈ కన్నడ ప్రాంతీయ కథని చెప్పారు. భూత కోల, దైవారాధన, నాగారాధన, కంబళ వంటి స్థానిక సంస్కృతులకి ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, స్మగ్లింగ్, అటవీ భూ ఆక్రమణల అంశాల్ని మేళవిస్తూ – దక్షిణ కన్నడలోని భూత కోలా, కంబళ, కోళ్ళ పందాలు సహా ఆచారాల్ని భాగం చేశారు. సామాజికంగానూ పరిస్థితిని ఏకరువు పెట్టారు. కుల సోపాన క్రమం కారణంగా చెప్పలేనంత అఘాయిత్యాలకి గురవుతున్న స్థానిక గిరిజనుల బాధలని ఆలోచనాత్మకంగా చిత్రించారు.

    2017 లో అభయ్ సింహా మత్స్యకారుల కుట్ర కథ ‘పడ్డాయి’ తీసినప్పుడు షేక్స్ పియర్ నాటకం ‘మాక్బెత్’ ని ఆధారంగా చేసుకున్నాడు. ఇందులో కూడా దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోని కథ చెప్పడానికి యక్షగానాన్ని ఉపయోగించాడు. పురాతనం అధునాతనం విలువల్ని యక్షగానంతో తేటతెల్లం చేశాడు. భూత కోలా జానపద గీత ప్రయోగం కూడా చేశాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా కోవకి చెందింది. దీనికి జాతీయ అవార్డు లభించింది.

    ‘కాంతార’ దక్షిణ కన్నడ యాసలో వుంటుంది. ఈ మొత్తం శక్తివంతమైన నేపథ్యాన్ని యాక్షన్ జానర్ లో థ్రిల్లింగ్ గా చెప్పారు. యాక్షన్, థ్రిల్, విశ్వాసాలు, జానపద రసపోషణ – వీటి అందమైన సమ్మేళనం ఇటీవలి కాలంలో వెండితెరమీద చేసిన ఉత్తమ ప్రయత్నాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కథలనేవి స్థానిక జీవితంలోనే చాలా వున్నాయనీ, వెతికితే రత్నాలు దొరుకుతాయనీ విశేషమైన రీసెర్చి చేసినట్టు అన్పించే కళాత్మక ప్రయోగం. హిందీలో ‘తుంబడ్’ (2018) అనే హార్రర్ కూడా ఈ కోవకి చెందిన జానపద కథల సమ్మేళనంతో కళాత్మకంగా తెరకెక్కిన హిట్ సినిమానే.

    నటనలు- సాంకేతికాలు

    రాసి, తీసి, నటించిన రిషభ్ శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గిరిజన శివ పాత్రలో రిషభ్ శెట్టి అనే తను కన్పించనంతగా లీనమై పాత్ర పోషణ చేశాడు. ఆనాడు ‘మృగయా’లో గిరిజన పాత్ర నటించిన మిథున్ చక్రవర్తిలాగా. పాత్ర ఎక్కడా కుదురుగా వుండదు. మెరుపు వేగంతో పరిగెడుతూ వుంటుంది. ఇందులోనే నేస్తాలతో అల్లరి చేసుకోవడం, తల్లి చేతిలో దెబ్బలు తినడం, ప్రేమించిన అమ్మాయితో సరసాలాడ్డం, తాగడం, కోళ్ళు చేపలు వండుకుని తినడం, దొరకి బంటుగా నిరూపించుకోవడం, ఫారెస్ట్ ఆఫీసర్ తో సిగపట్లకి దిగడం అన్నీ జరిగిపోతూంటాయి.

    ఎంత పోరాట పటమ వున్నా వ్యవస్థ చేతిలో బలయ్యే సామాజిక వర్గమే తనది. ఈ సహజత్వం కోసం హీరోయిజాన్ని దూరం పెట్టి జైలు సీన్లు నటించాడు. గిరిజనుడే కని పిస్తాడు తప్ప తెలుగు స్టార్, తెలుగు హీరో కనిపించడు. ఇందుకే పానిండియా స్టార్ ప్రభాస్ రెండు సార్లు ఈ సినిమా చూసినట్టుంది. ఇక ఇరవై నిమిషాల క్లయిమాక్స్ అయితే అపూర్వం, అద్భుతం- ఇంకేమైనా చెప్పుకోవచ్చు. క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు వెళ్ళి వెళ్ళి పతాక స్థాయికి చేరేసరికి -తన పాత్రే మారిపోయి- ప్రేక్షకులు అవాక్కయ్యేలా క్లోజింగ్ ఇమేజితో బలమైన స్టాంపు గుద్ది వదిలాడు. పాత్ర ఇలా మారిపోతుందని ఎవ్వరూ వూహించరు! ఈ పాత్రలో రౌద్రంగా ఆకాశాన్నంటిన నటనా, నాట్యమూ రిషభ్ శెట్టిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టేశాయి!

    హీరోయిన్ గా తెల్లటి వర్ణపు మెరిసిపోయే గ్లామర్ నటిని తీసుకోకుండా, గిరిజనురాలిలా కన్పించే స్థానిక నటి సప్తమీ గౌడ నటన కూడా చెప్పుకోదగ్గది. ఫారెస్ట్ గార్డుగా పై అధికారి చేతిలో అవమానాలు భరిస్తూ, చివరికి కోపం బద్ధలై ఆయుధానికి పనిచెప్పే దృశ్యం కథలోంచి పుడుతూ వచ్చిన సహజ భావోద్వేగం. దొరగా అచ్యుత్ కుమార్ మృదువైన నటన, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ కరకు ప్రవర్తన కథనానికి పాజిటివ్ నెగెటివ్ డైనమిక్స్ గా వుంటాయి. రిషభ్ తల్లిపాత్ర నటించిన మానసి సుధీర్ సంఘర్షణాత్మక పాత్ర, నటన కూడా గుర్తుండి పోతాయి. ఇక రిషభ్ నేస్తాలుగా నటించిన ఆర్టిస్టులు సహా మిగిలిన నటీనటులందరూ ఒక పకడ్బందీ గిరిజన వాతావరణ సుష్టికి తోడ్పడ్డారు.

    సాంకేతికంగా చూస్తే ఇదొక వండరే. అటవీ ప్రాంతాన్నీ, ప్రకృతినీ, గిరిజన నివాసాల్నీ తెర మీద కళాత్మకంగా ఆవిష్కరించాడు కెమెరామాన్ అరవింద్ కశ్యప్. రాత్రి పూట దృశ్యాలైతే, ముఖ్యంగా క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు చిత్రకారుడు పెయింటిగ్ వేసినట్టున్నాయి. అజనీష్ లోకనాథ్ ట్రైబల్ బాణీలు, అడవిలో నిగూఢంగా వున్న శక్తి తాలూకు హార్రర్ బాణీలూ ఇవన్నీ నేటివిటీని, సంస్కృతినీ దాటిపోలేదు.

    దర్శకుడుగా రిషభ్ శెట్టి ఇంకో మెట్టు పైకెక్కాడు. ఇంత అద్భుతాన్ని కేవలం 16 కోట్లతో తీసి వందల కోట్ల రిటర్న్స్ పొందడం చూస్తే, తెలుగులో ఇలాటిది ఎప్పుడు సాధిస్తారో అనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో తెలుగు జీవితం లేకుండా చేయడానికి పదుల- వందల కోట్ల బడ్జెట్లు కావాల్సి వస్తోంది. 

    Kantara Kantara Movie Review
    Previous ArticleHyderabad won World Green City Award, CM KCR & Minister KTR elated
    Next Article Voters still believe Rajagopal Reddy as Congress candidate
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.