సంఘాల గోల ఎక్కువైపోతోందా..?
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయిన వారందరూ వచ్చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయాల్సిందిగా తెలంగాణా కమ్మసంఘంలోని కీలక వ్యక్తులు బాగా ఒత్తిడి తెస్తున్నారు.
ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ కులసంఘాల గోల ఎక్కువైపోతోంది. ఈ సంఘాల వల్ల సమాజానికి లేదా సంబంధిత కులాలకు ఎంత మేళ్ళు జరుగుతాయో తెలీదు కానీ కులాల పేరుతో గోల మాత్రం బాగా ఎక్కువపోతోంది. విచిత్రం ఏమిటంటే ఈ గోల రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి పెరిగిపోతుండటం. ఈనెల 21వ తేదీన ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగసభకు కమ్మ సంఘం చాలా యాక్టివ్ రోల్ తీసుకుంది. ఇక 26వ తేదీన విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఎలాగూ కాపుసంఘం ఆధ్వర్యంలోనే జరుగుతోంది.
ఖమ్మం విషయం తీసుకుంటే 21వ తేదీన తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించాలని అనుకున్నారు. పేరుకు టీడీపీ బహిరంగసభే అయినా వ్యవహారం మొత్తం నడుపుతున్నది కమ్మ సంఘమే. అసలు బహిరంగసభ ఉద్దేశ్యమే రాష్ట్రంలో ఉన్న కమ్మోరినందరినీ ఏకంచేసి సత్తా చాటడం. కమ్మోరంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అటు ఏపీలో సత్తా చాటకపోతే భవిష్యత్తులో కమ్మ సామాజికవర్గం చాలా సమస్యలను ఫేస్ చేయాల్సుంటుందని సంఘాల్లోని కీలక వ్యక్తులు మిగిలి వారిని భయపెడుతున్నారు.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయిన వారందరూ వచ్చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయాల్సిందిగా తెలంగాణా కమ్మసంఘంలోని కీలక వ్యక్తులు బాగా ఒత్తిడి తెస్తున్నారు. కమ్మసంఘం ప్లాన్ ఏమిటంటే కమ్మ నేతలందరూ పార్టీలో చేరిపోతే మళ్ళీ టీడీపీకి పూర్వవైభవం వచ్చేస్తోందని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకోవటమే. ఇక్కడి పరిణామాలను చూపించి ఏపీలో కూడా బీజేపీని చంద్రబాబు నాయుడుని దగ్గర చేయటమే కమ్మోరి వ్యూహం. ఇందుకోసమనే కమ్మసంఘం చాలా యాక్టివ్ గా పనిచేస్తోంది.
ఇక విశాఖ బహిరంగసభ అచ్చంగా కాపు సంఘంమే నిర్వహిస్తోంది. వివిధ పార్టీల్లోని కాపు నేతలు, ప్రముఖులందరినీ ఏకం చేసి కాపుల సత్తా చాటడమే ఉద్దేశ్యమని చెబుతున్నారు. అయితే కాపులందరినీ ఏకంచేసి అందరినీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా పనిచేయించటమే అసలు వ్యూహం. వివిధ పార్టీల్లో ఉన్న కాపునేతలు, ప్రముఖులు న్యూట్రల్స్ ను జనసేన తరపున వచ్చేఎన్నికల్లో పోటీచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ కులసంఘాల ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.