Telugu Global
NEWS

మాతాశిశు మరణాలపై ఇంత అమానవీయమా?

ప్రభుత్వం తీరుపై కేటీఆర్‌ ఫైర్‌.. ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి

మాతాశిశు మరణాలపై ఇంత అమానవీయమా?
X

గాంధీ హాస్పిటల్‌ లో మాతాశిశు మరణాలపై ప్రభుత్వం అమానవీయంగా స్పందిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రభుత్వం తన బాధ్యత మరిచి ప్రతిపక్షాలపై బురద జల్లడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్‌ లో మాతాశిశు మరణాలపై బీఆర్‌ఎస్‌ తరపున ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిపుణుల కమిటీ గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలపై అధ్యయనం చేస్తుందని, వారి పరిశీలనలో తేలిన అంశాలను ప్రభుత్వానికి నివేదించడంతో పాటు ప్రజలకు వివరిస్తామన్నారు. గాంధీలో దారుణ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎదురుదాడికి దిగడం బాధకరమన్నారు. ఇకనైనా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు మాని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మాతాశిశు మరణాలపై రివ్యూ చేయాలని, నాణ్యమై వైద్యం అందించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్‌ డాక్టర్లను ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా బదిలీ చేసిందని, ఫలితంగానే సరైన వైద్య సేవలు అందడం లేదని తెలిపారు. వైద్యం అందకనే శిశువులు పిట్టల్లా రాలిపోతున్నారని.. వారిని ఆదుకోండి మహాప్రభో అంటే తమపైనే బురద జల్లుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రైవేట్‌ ఆస్పత్రులకు కొమ్ముకాసిందే నిజమైతే హైదరాబాద్‌ కు నాలుగు దిక్కులా టిమ్స్‌ , వరంగల్‌ లో హెల్త్‌ సిటీ ఎందుకు నిర్మిస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్యం కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. శిశు మరణాలను ఒక సంఖ్యలా చూడొద్దని శిశువు, తల్లి మరణం ఆ కుటుంబాన్ని ఎంతలా కుంగదీస్తుందో మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు.

First Published:  20 Sept 2024 6:03 AM IST
Next Story