Telugu Global
NEWS

రామోజీ ఇంత భయపడుతున్నారా?

మార్గదర్శి ముసుగులో తాను చేస్తున్న అక్రమాలు, మోసాలు ఇప్పటికే జనాలందరికీ తెలిసిపోయాయని రామోజీ గింజుకుంటున్నారు. తవ్వేకొద్ది ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో అనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే తనకు అనుకూలంగా కోర్టు నుండి బ్లాంకెట్ ఆర్డర్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.

రామోజీ ఇంత భయపడుతున్నారా?
X

ప్రపంచానికి నీతులు చెప్పే రామోజీరావు తనదాకా వచ్చేసరికి ఏదీ పాటించటంలేదు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలని ప్రతిరోజు అరిచి గోల చేస్తుంటారు. కానీ మార్గదర్శి విషయానికి వచ్చేసరికి అంతా గుట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు. మార్గదర్శి విషయంలో ఏమి జరుగుతోందో జనాలకు తెలియనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడే రామోజీలోని భయం జనాలకు అర్థ‌మైపోతోంది. మార్గదర్శిలో అక్రమాలు, మోసాలు ఏమీ జరగకపోతే ఎందుకని పారదర్శకంగా ఉండటంలేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రజలందరికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాదు తనపైన కూడా ఉందన్న విషయాన్ని రామోజీ మరచిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే మార్గదర్శిలో సోదాలు జరపకూడదట, రికార్డులను పరిశీలించకూడదట, ఉద్యోగులెవరినీ అదుపులోకి తీసుకుని విచారించకూడదట. చివరకు సోదాల్లో, రికార్డుల పరిశీలనపై మీడియా సమావేశాలూ పెట్టకూడదట. అలాగని సీఐడీతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రామోజీ తరపున లాయర్ తెలంగాణ హైకోర్టును అడగటమే విచిత్రంగా ఉంది. 60 ఏళ్ళ వ్యాపారంలో తాను ఎలాంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడలేదని పదేపదే చెప్పుకుంటున్నారు.

అదే నిజమైతే సీఐడీ సోదాలను ఆపాలని, రికార్డులను పరిశీలించకూడదని, విచారణ కోసం ఎవరినీ అదుపులోకి తీసుకోకూడదని ఎందుకు కోర్టులో కేసులు వేశారు. విచారణకు రమ్మని సీఐడీ ఇచ్చిన రెండు నోటీసులు ఇస్తే తాను, కోడలు, ఎండీ శైలజ ఎందుకు హాజరుకాలేదు? సీఐడీ విచారణ అంటేనే మామ, కోడలు ఎందుకు భయపడిపోతున్నారు? సీఐడీ అధికారులు మీడియా సమావేశాలు పెట్టి మార్గదర్శి విషయాలు మాట్లాడకూడదని కోర్టులో రామోజీ తరపు లాయర్ ఎందుకు వాదించారు.

మార్గదర్శి ముసుగులో తాను చేస్తున్న అక్రమాలు, మోసాలు ఇప్పటికే జనాలందరికీ తెలిసిపోయాయని రామోజీ గింజుకుంటున్నారు. తవ్వేకొద్ది ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో అనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే తనకు అనుకూలంగా కోర్టు నుండి బ్లాంకెట్ ఆర్డర్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. నిజంగానే మార్గదర్శిలో ఎలాంటి మోసాలు, అక్రమాలు జరగకపోతే తనంతట తానే విచారణకు ఆహ్వానించుంటే కథ‌ వేరే విధంగా ఉండేది. విచారణ కోసం ఇంటికి వెళితే లోపలకు రానివ్వరు. పోనీ తమ ఆఫీసుకు విచారణకు రమ్మంటే రారు. సోదాలు జరపకూడదట, రికార్డులు పరిశీలించకూడదట చివరకు మీడియా సమావేశాలు పెట్టకూడదట. ఈ వాదనలతోనే అర్థ‌మైపోతోంది రామోజీ ఎంతగా భయపడుతున్నారో.


First Published:  24 Aug 2023 11:13 AM IST
Next Story