వినాశ కాలే.. విపరీత ఉష్ణోగ్రత
రికార్డ్ లు బ్రేక్ అయితే సంబరాలు జరుగుతాయి. కానీ ఇది బాధపడాల్సిన సందర్భం, భయపడాల్సిన సందర్భం. ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అంటే, మనం వినాశనానికి దగ్గరవుతున్నామనే లెక్క.
ఏడాదికేడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తరిగిపోతున్న వృక్షసంపద, పెరిగిపోతున్న ఇంధన వాడకంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారంతో భూతాపం పెరిగిపోతోంది. తాజాగా ప్రపంచ ఉష్ణోగ్రత ఇప్పుడు సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. జులై-3 న అత్యంత వేడి రోజుగా రికార్డులకెక్కింది.
ఈ ఏడాది జులై-3న ప్రపంచ వ్యాప్తంగా అత్యథిక సగటు ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలను లెక్కతీసి, వాటి సగటు లెక్క కట్టింది అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రిడిక్షన్ సంస్థ. ఇప్పటి వరకూ ఇదే అత్యంత అధిక సగటు ఉష్ణోగ్రతగా పేర్కొంది.
సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఆఫ్రికాలో అక్కడక్కడ అత్యథిక పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీలుగా నమోదవుతోంది. అంటార్కిటికాలో కూడా అత్యథిక ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతూ వాతావరణ కల్లోల పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఇప్పటి వరకూ అత్యథిక సగటు గరిష్ట ఉష్ణోగ్రత 16.92 డిగ్రీలు. 2016 ఆగస్ట్ లో నమోదైన ఆ రికార్డ్ ను ఈ ఏడాది జులై-3 బ్రేక్ చేసింది. 17.3 డిగ్రీల అత్యథిక ఉష్ణోగ్రతతో జులై-3 రికార్డు పుటల కెక్కింది.
రికార్డ్ లు బ్రేక్ అయితే సంబరాలు జరుగుతాయి. కానీ ఇది బాధపడాల్సిన సందర్భం, భయపడాల్సిన సందర్భం. అవును, ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అంటే, మనం వినాశనానికి దగ్గరవుతున్నామనే లెక్క. కరోనా లాంటి వైపరీత్యాలు ఒకేసారి ప్రాణాలను తుడిచిపెట్టేస్తాయి. కానీ ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు, దీర్ఘకాలంలో మానవాళికి పెను ముప్పులా పరిణమిస్తాయి. నివాసయోగ్యం కానీ గ్రహాల జాబితాలో భూమిని చేర్చేందుకు అడుగులు పడుతున్నాయనే అనుకోవాలి. ఇది చేతులారా మనకి మనమే చేసుచేసుకుంటున్న ద్రోహం అని అంటున్నారు శాస్త్రవేత్తలు.