ప్రపంచాన్ని కలవరపెడుతున్న సూడాన్ సమస్య
ల్యాబ్ ను సాయుధ బలగాలు స్వాధీనం చేసుకోవడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుకోనిదేదైనా జరిగి.. అక్కడి వైరస్‌లు గాని, వ్యాధికారక జీవాలుగానీ బయటికి వస్తే.. భారీ ప్రమాదం చోటుచేసుకునే అవకాశముందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
సూడాన్‌లో ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. సూడాన్‌లోని సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్‌ను అక్కడి సాయుధ బలగాలు మంగళవారం ఆక్రమించుకోవడమే.
ఆ ల్యాబ్‌లో పోలియో, మీజిల్స్ సహా రకరకాల వ్యాధులకు సంబంధించిన నమూనాలు ఉన్నాయని, ఒకవేళ ప్రమాదవశాత్తూ అవి బయటికి వస్తే.. జీవ వినాశనానికి దారితీస్తాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య మానవాళికి చాలా చాలా ప్రమాదకరమని సూడాన్‌లోని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి సయీద్ అబిద్ తెలిపారు. వీలైనంత త్వరగా సాయుధ బలగాలు అక్కడినుంచి నిష్క్రమించాలని ఆయన కోరారు. మంగళవారం ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాకు వెల్లడించారు.
దాదాపు ప్రతి దేశంలోనూ ఒక సెంట్రల్ పబ్లిక్ ల్యాబ్ ఉంటుంది. దేశంలో గతంలో విజృంభించిన వివిధ వ్యాధులకు సంబంధించిన వైరస్‌లను, నమూనాలను అక్కడ భద్రపరుస్తారు. భవిష్యత్తులో మళ్లీ వ్యాధులు సంభవిస్తే పరిశోధనలు చేసేందుకు ఈ నమూనాలు ఉపయోగపడతాయి. ఈ ల్యాబ్ మొత్తం కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో జాతీయ వ్యాధుల నియంత్రణ విభాగం ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా వైరస్ ఆ ల్యాబ్ నుంచి బయటికొచ్చిందంటే రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశముంటుంది. చైనాలోని వూహాన్ నుంచి బయటికొచ్చిందని భావిస్తున్న కరోనా వైరస్ కూడా ఇలాంటిదే కావడం గమనార్హం.
అంత కీలకమైనది కాబట్టే.. ల్యాబ్ ను సాయుధ బలగాలు స్వాధీనం చేసుకోవడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుకోనిదేదైనా జరిగి.. అక్కడి వైరస్‌లు గాని, వ్యాధికారక జీవాలుగానీ బయటికి వస్తే.. భారీ ప్రమాదం చోటుచేసుకునే అవకాశముందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.