Telugu Global
International

కిమ్ కి ఏమైంది.. అజ్ఞాతంలో ఉన్నారా..? అనారోగ్యం పాలయ్యారా..?

అమెరికా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం జరిగిన ఒక ముఖ్య సమావేశానికి కిమ్ జోంగ్ ఉన్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి పలు అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

కిమ్ కి ఏమైంది.. అజ్ఞాతంలో ఉన్నారా..? అనారోగ్యం పాలయ్యారా..?
X

ప్రపంచంలోని పాలకుల్లో అత్యంత క్రూరమైన నేతగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు తెచ్చుకున్నారు. అందుకే ఉత్తరకొరియా అత్యంత చిన్న దేశం అయినప్పటికీ అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఉత్తర కొరియా పేరు వింటే హడలిపోతుంటుంది. ఇదిలా ఉండగా దాదాపు 40రోజుల‌కు పైగా కిమ్ బయట ప్రపంచంలో కనిపించడం లేదు. దీంతో ఆయన మరోసారి అజ్ఞాతంలో ఉన్నారా..? లేకపోతే ఆరోగ్యం క్షీణించిందా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

కిమ్ గతంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2014లో వరుసగా 40 రోజులపాటు కిమ్ బయట ప్రపంచంలో కనిపించలేదు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆయన రోజుల తరబడి బయట ప్రపంచానికి కనిపించలేదు. శత్రుభయం కారణంగా కిమ్ బయట ఎక్కువగా తిరగరనే పేరు ఉంది. అందుకే రోజుల తరబడి కిమ్ అజ్ఞాతంలో గడుపుతుంటారు.

అయితే ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా కార్యక్రమాలకు కిమ్ హాజరవుతూ ఉంటారు. దేశ రాజధాని ప్యాంగ్ యాంగ్ లో కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ పరేడ్ జరగనుంది. బుధవారం ఈ మాస్ పరేడ్ నిర్వహించనున్నారు. గతంలో పరేడ్స్ నిర్వహించిన సందర్భంలో ప్రపంచానికి ఉత్తరకొరియా క్షిపణులు, అణ్వాయుధ సామర్థ్యాన్ని తెలిసేలా ప్రదర్శనలు చేసేవారు. ఈ దఫా కూడా అటువంటి ప్రదర్శనలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే అమెరికా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం జరిగిన ఒక ముఖ్య సమావేశానికి కిమ్ జోంగ్ ఉన్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి పలు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. 40 రోజులకు పైగా కిమ్ బయట ఎక్కడా కనిపించకపోవడం, ముఖ్యమైన సమావేశానికి కూడా హాజరు కాకపోవడంతో కిమ్ కి ఏమై ఉంటుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

First Published:  7 Feb 2023 8:44 PM IST
Next Story