హసన్ నస్రల్లా వారసుడిని చంపేశాం
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సఫీద్దీన్ మృతి చెంది ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు. ఇదే విషయాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ దళాలు
ఇజ్రాయెల్ చేతిలో హెజ్బొల్లాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రూప్ అధినేత హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను అతని వారసుడిగా భావించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సఫీద్దీన్ మృతి చెంది ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ దళాలు ధృవీకరించాయి. ఈ మేరకు ఐడీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
హసన్ నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్‌ను చంపేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆయనను మూడు వారాల కిందటే మట్టుబెట్టిన విషయాన్ని ధృవీకరించింది. దక్షిణ బీరూట్ శివారులో చేసిన దాడిలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్న హషీమ్, ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ హెడ్ అలీ హుస్సేన్ హజిమా, ఇతర కమాండ్లు మృతి చెందినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మరోవైపు దాడి సమయంలో హెజ్బొల్లాకు చెందిన 25 మందికి పైగా మిలిటెంట్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు ఏరియల్ ఇంటెలిజె్స్ తెలిపింది.
లెబనాన్‌లోని దాహియాలో ఓ బంకర్లో సినియర్ హెజ్బొల్లా నేతలతో హషీమ్ సమావేశం నిర్వహించారన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో లెబనీస్ గూఢాచార విభాగం అధిపతి హుస్సేన్ అలీ హజిమాతో పాటు సఫీద్దీన్ మృతి చెందినట్లు అప్పట్లో అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని ఐడీఎఫ్ ధృవీకరించింది. అయితే ఈ ప్రకటనపై హెజ్బొల్లా ఇప్పటివరకు స్పందించలేదు.
సఫీద్దీన్ హెజ్బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతిగా, జీహాద్ కౌన్సిల్ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. 2017లో హషీమ్‌ను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్లా మరణం తర్వాత హెజ్బొల్లా పగ్గాలు అతనికే అప్పగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మృతి చెందడం విశేషం.