కీవ్‌లో బైడెన్ ఆకస్మిక పర్యటన
ప్రస్తుత పర్యటనలో ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న భీకర దాడుల నేపథ్యంలో జరిగిన విధ్వంసాన్ని బైడెన్ ప్రత్యక్షంగా చూశారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉక్రెయిన్‌లో సోమవారం ఆకస్మిక పర్యటన చేపట్టారు. రష్యా భీకరంగా దాడులు జరుపుతున్న వేళ ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా ఆయన పోలండ్ నుంచి నేరుగా కీవ్‌లోకి ఉదయం 8 గంటలకు అడుగుపెట్టారు. యుద్ధం మొదలై దాదాపు ఏడాది కావస్తున్న సందర్భంగా ఉక్రెయిన్‌కు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కి 50 బిలియన్ డాలర్ల అదనపు మిలటరీ సాయాన్ని కూడా ప్రకటించారు. ఉక్రెయిన్‌కి అమెరికాతో పాటు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా బైడెన్ భరోసా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడి హోదాలో యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో పర్యటించడం జోబైడెన్‌కు ఇదే మొదటిసారి. ఆయనకు ముందు అధ్యక్షులుగా కొనసాగిన ట్రంప్, ఒబామా, బుష్.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లలో ఆకస్మికంగా పర్యటించి తమ సైన్యాలను కలిశారు.
ప్రస్తుత పర్యటనలో ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న భీకర దాడుల నేపథ్యంలో జరిగిన విధ్వంసాన్ని బైడెన్ ప్రత్యక్షంగా చూశారు. కీవ్‌లోని సెయింట్ మైఖేల్ కథెడ్రల్ చర్చిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి బైడెన్ ఈ సందర్భంగా సందర్శించారు. 2014 నుంచి రష్యాతో జరుపుతున్న పోరాటంలో అసువులు బాసిన సైనికులకు ఆయన నివాళులర్పించారు.