Telugu Global
International

ఉక్రెయిన్‌ని గెలిపించ‌డ‌మే ల‌క్ష్యం.. - అమెరికా

యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ విజ‌య‌వంతం కావ‌డానికి అవ‌స‌ర‌మైన సామ‌ర్థ్యాల‌ను ఆ దేశానికి అందించ‌డం త‌మ మిత్ర‌దేశాల ల‌క్ష్య‌మ‌ని అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హామండ‌లి స్ట్రాట‌జిక్ కమ్యూనికేష‌న్స్ సమ‌న్వ‌య‌క‌ర్త జాన్‌కిర్బీ గురువారం వెల్ల‌డించారు.

ఉక్రెయిన్‌ని గెలిపించ‌డ‌మే ల‌క్ష్యం.. - అమెరికా
X

ర‌ష్యాతో కొన‌సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ని గెలిపించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని అమెరికా వెల్ల‌డించింది. ఆ దేశ యుద్ధ సామ‌ర్థ్యాల‌ను పెంచుతామ‌ని తెలిపింది. అందుకు గానూ నాటో దేశాల‌తో క‌లిసి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలూ చేస్తామ‌ని వైట్‌హౌస్ స్ప‌ష్టం చేసింది. జ‌ర్మ‌నీ ఉక్రెయిన్‌కి అత్యాధునిక లెప‌ర్డ్-2 ఏ-6 ట్యాంకుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో యూఎస్ ఈ విష‌యం వెల్ల‌డించింది. అంతేగాక త‌మ అత్యాధునిక అబ్రామ్స్ ట్యాంకుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపింది. యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ విజ‌య‌వంతం కావ‌డానికి అవ‌స‌ర‌మైన సామ‌ర్థ్యాల‌ను ఆ దేశానికి అందించ‌డం త‌మ మిత్ర‌దేశాల ల‌క్ష్య‌మ‌ని అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హామండ‌లి స్ట్రాట‌జిక్ కమ్యూనికేష‌న్స్ సమ‌న్వ‌య‌క‌ర్త జాన్‌కిర్బీ గురువారం వెల్ల‌డించారు.

మ‌రింత ఉధృతంగా ర‌ష్యా దాడులు..

ఉక్రెయిన్‌కి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని జ‌ర్మ‌నీ, అమెరికా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ర‌ష్యా త‌న దాడులు మ‌రింత ఉధృతం చేసింది. కీవ్‌, ఒడెసాల‌పై క్షిప‌ణుల వ‌ర్షం కురిపించింది. ఆత్మాహుతి డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. ఈ దాడుల్లో 11 మంది పౌరులు చ‌నిపోయార‌ని, మ‌రో 11 మంది గాయ‌ప‌డ్డార‌ని ఉక్రెయిన్ తెలిపింది. ర‌ష్యాకు చెందిన 47 క్షిప‌ణుల‌ను నేల‌కూల్చామ‌ని ఉక్రెయిన్ వెల్ల‌డించింది.

వాగ్న‌ర్ సంస్థ‌పై అమెరికా ఆంక్ష‌లు..

ర‌ష్యాకు చెందిన వాగ్న‌ర్ సంస్థ‌పై అమెరికా ఆంక్ష‌లు విధించింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ర‌ష్యాకు అండ‌గా నిలిచినందుకు, ఆఫ్రికాలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డినందుకు ఈ ఆంక్ష‌లు విధించింది. దాని అనుబంధ సంస్థ‌ల‌పైనా ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్టు గురువారం అమెరికా ప్ర‌క‌టించింది.

First Published:  27 Jan 2023 11:30 AM IST
Next Story