Telugu Global
International

ముంబై దాడుల నిందితుడిని అప్ప‌గించేందుకు అమెరికా కోర్టు ఓకే

భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్ మూలాలున్న తహవూర్ రాణా 2008లో జరిగిన ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ముంబై దాడుల నిందితుడిని అప్ప‌గించేందుకు అమెరికా కోర్టు ఓకే
X

26/11 ముంబై దాడుల్లో కీల‌క నిందితుల్లో ఒక‌డైన త‌హ‌వూర్ రాణాను భార‌త్‌కు అప్ప‌గించేందుకు అమెరికాకు చెందిన కోర్టు ఓకే చెప్పింది. దీంతో రాణాను త‌మ‌కు అప్ప‌గించాలంటూ భార‌త్ చేసిన అభ్య‌ర్థ‌న ఫ‌లించింది. ఈ మేరకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు తీర్పునిచ్చింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్ మూలాలున్న తహవూర్ రాణా 2008లో జరిగిన ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో...

భారత ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంతో.. ఉగ్రవాదం కట్టడికి ఇరుదేశాల మధ్య కీలక అడుగుపడిన‌ట్ట‌యింది. 26/11 ముంబై దాడుల్లో రాణా పాత్రపై ఎన్ఐఏ (NIA) దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం రాణా అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనిలో భాగంగా అతడిని అప్పగించాలని భారత్ కోరడంతో అక్క‌డి కోర్టు అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చింది.

ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు త‌హ‌వూర్ రాణాకు 14 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది. 2008 నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి తహవూర్ అత్యంత సన్నిహితుడు. దాడులకు ముందు ముంబైలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. జూన్ 22న ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

First Published:  18 May 2023 12:16 PM IST
Next Story