చైనాలో 10 లక్షల మంది ప్రాణాలకు ముప్పు..!
దీనివల్ల 2023లో చైనాలో కోవిడ్ వల్ల 10 లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) హెచ్చరించింది.
చైనాలో 2023లో కోవిడ్ విలయతాండవం చేసే అవకాశముందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. వచ్చే ఏప్రిల్ నాటికి కోవిడ్ తారాస్థాయికి చేరే అవకాశముంటుందని, ఆ దేశ జనాభాలో మూడో వంతు మంది కరోనా బారిన పడతారని ఐహెచ్ఎంఏ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. దీనివల్ల 2023లో చైనాలో కోవిడ్ వల్ల 10 లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) హెచ్చరించింది.
రోజుకు లక్షల్లో కేసులు..
చైనాలో ఇప్పటికే కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతుండటంతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వెల్లువెత్తిన ప్రజా నిరసనతో ఆ దేశం జీరో కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఆ దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. ఇప్పటికే రోజుకు లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ ఒమిక్రాన్. దీనికి చాప కింద నీరులా విస్తరించే గుణం ఉంది. ఎన్ని కఠిన నిబంధనలు విధించినా దీనికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని ముర్రే పేర్కొన్నారు.