Telugu Global
International

చైనా ర‌ష్యాతో జ‌ట్టు క‌డితే.. ప్ర‌పంచ యుద్ధం త‌థ్యం.. - ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ

చైనా ర‌ష్యాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించకుండా ఉండ‌టం త‌మ‌కు చాలా ముఖ్య‌మ‌ని జెలెన్ స్కీ తెలిపారు. చైనా త‌మ ప‌క్షాన ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పిన ఆయ‌న.. కానీ అది సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని చెప్పారు.

చైనా ర‌ష్యాతో జ‌ట్టు క‌డితే.. ప్ర‌పంచ యుద్ధం త‌థ్యం.. - ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ
X

ఉక్రెయిన్‌కు వ్య‌తిరేకంగా చైనా ర‌ష్యాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే అది ప్ర‌పంచ యుద్ధాన్ని తెచ్చేందుకు కార‌ణ‌మ‌వుతుంద‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ స్ప‌ష్టం చేశారు. చైనా తీసుకునే నిర్ణ‌యాలు ప్ర‌పంచ యుద్ధానికి దారితీయొచ్చ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. సోమ‌వారం ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

చైనా ర‌ష్యాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించకుండా ఉండ‌టం త‌మ‌కు చాలా ముఖ్య‌మ‌ని జెలెన్ స్కీ తెలిపారు. చైనా త‌మ ప‌క్షాన ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పిన ఆయ‌న.. కానీ అది సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డేం జ‌రుగుతోంద‌నే విష‌య‌మై చైనా ఆచ‌ర‌ణాత్మ‌క విశ్లేష‌ణ చేసుకోవాల‌ని జెలెన్ స్కీ సూచించారు. చైనా ర‌ష్యాతో జ‌ట్టు క‌డితే ప్ర‌పంచ యుద్ధం వ‌స్తుంద‌నే విష‌యం చైనాకు కూడా తెలుస‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మాల్డోవా ర‌క్ష‌ణ‌కు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా జెలెన్ స్కీ తెలిపారు. మాల్డోవాకు సంబంధించి త‌న‌కు అందిన ఇంటెలిజెన్స్ స‌మాచారాన్ని ఆ దేశ అధ్య‌క్షురాలు మైయ సందుకు అంద‌జేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. అక్క‌డ ర‌ష్యా అనుకూల వ‌ర్గాలు తిరుగుబాటుకు య‌త్నిస్తున్నాయ‌ని తెలిపారు.

గ‌త వారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మ్యూనిక్ ర‌క్ష‌ణ స‌ద‌స్సులో చైనా దౌత్య‌వేత్త వాంగ్ యీని హెచ్చ‌రించారు. చైనా నుంచి ర‌ష్యాకు ప‌రిక‌రాల సాయం చేసిన‌వారు ప‌రిణామాలు అనుభ‌వించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. బీజింగ్ నుంచి మాస్కోకు ఆయుధాలు వెళ‌తాయ‌ని అమెరికా ఆందోళ‌న చెందుతోంది. ఈ నేప‌థ్యంలో జెలెన్ స్కీ తాజా హెచ్చ‌రిక‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

First Published:  21 Feb 2023 3:45 PM IST
Next Story