Telugu Global
International

చైనా సీసీ కెమెరాలంటే బ్రిటన్‌కి ఎందుకంత భయం..?

67 మంది బ్రిటిష్ చట్టసభ సభ్యులు చైనా సీసీ కెమెరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు కంపెనీల కెమెరాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు.

చైనా సీసీ కెమెరాలంటే బ్రిటన్‌కి ఎందుకంత భయం..?
X

చైనా సీసీ కెమెరాలను వెంటనే మార్చేయాలని బ్రిటన్ భావిస్తోంది. ముఖ్యంగా రెండు కంపెనీల సీసీ కెమెరాలంటే బ్రిటన్ భయంతో వణికిపోతోంది. వాటిని ఫిక్స్ చేసేటప్పుడు లేని భయం ఇప్పుడు కొత్తగా బ్రిటన్‌లో మొదలైంది. అర్జంట్‌గా వాటిని తీసేసి, చైనాయేతర కంపెనీల సీసీ కెమెరాలు బిగించాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. చట్టసభ సభ్యులు తమ భద్రత గురించి ఆందోళన లేవనెత్తడంతో ప్రభుత్వం చివరకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

బ్రిటన్‌లో అధికారిక భవనాలకు, ఇతర ప్రభుత్వపరమైన అవసరాలకు ఉపయోగించే సీసీ కెమెరాలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అయ్యాయి. హిక్ విజన్, దహువా అనే కంపెనీల సీసీ కెమెరాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంది. అయితే ఆ రెండు కంపెనీలు చైనా నేషనల్ ఇంటెలిజెన్స్ చట్టానికి లోబడి ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం అక్కడి ప్రభుత్వం అడిగితే, భద్రతా అవసరాల దృష్ట్యా తమ దగ్గర ఉన్న ఎలాంటి సమాచారాన్నయినా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. దానికి నిరాకరించకూడదు. అంటే బ్రిటన్‌లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయిన సమాచారం కూడా ఇలాగే అందిస్తారా అంటే, దానికి సరైన రుజువులు లేవు. కానీ బ్రిటన్ మాత్రం భయపడిపోతోంది. 67 మంది బ్రిటిష్ చట్టసభ సభ్యులు చైనా కెమెరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు కంపెనీల కెమెరాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు.

ఆరోపణలను కొట్టిపారేసిన హిక్ విజన్..

తమపై వస్తున్న ఆరోపణలను హిక్ విజన్ కంపెనీ కొట్టిపారేసింది. వినియోగదారుల డేటాను తాము థర్డ్ పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదన తెలిపింది. వినియోగదారుల డేటాబేస్ నిర్వహణ తమ బాధ్యత కాదని చెప్పింది. బ్రిటన్‌లోని క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను తాము విక్రయించడం లేదని వివరణ ఇచ్చింది.

చైనా కంపెనీల వివరణ ఎలా ఉన్నా.. బ్రిటన్ మాత్రం ఆ రెండు కంపెనీలను చూసి భయపడుతోంది. భద్రత విషయంలో రాజీపడేది లేదని, ఆ రెండు కంపెనీల కెమెరాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వెంటనే ఇతర కంపెనీల కెమెరాలను సున్నితమైన భవనాల్లో అమర్చేందుకు నిర్ణయం తీసుకుంది.

First Published:  25 Nov 2022 11:12 AM GMT
Next Story