భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం..పునరుద్ఘాటించిన బ్రిటన్
యూఎన్ఎస్‌సీ ప్రతీ ఏడాది నిర్వహించే భద్రతా మండలి సంస్కరణల చర్చా కార్యక్రమంలో భారత్‌కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బ్రిటన్ పునరుద్ఘాటించింది. ప్రస్తుతం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్‌సీ)లో ఐదు శాశ్వత సభ్యత్వ దేశాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకు శాశ్వత సభ్యత్వం ఉండటంతో వాటికి వీటో అధికారం కూడా సంక్రమించింది. కాగా, గత కొన్నాళ్లుగా యూఎన్‌ఎస్‌సీలో పర్మనెంట్ సభ్యులతో పాటు, నాన్-పర్మనెంట్ సభ్యుల సంఖ్యను కూడా పెంచాలనే డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా అన్ని అర్హతలు ఉన్న ఇండియాకు ఎందుకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం లేదనే అనుమానాలు కూడా ఉన్నాయి.
తాజాగా బ్రిటన్ ఈ ప్రతిపాదనకు మరో సారి మద్దతు పలికింది. యూఎన్ఎస్‌సీ ప్రతీ ఏడాది నిర్వహించే భద్రతా మండలి సంస్కరణల చర్చా కార్యక్రమంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బ్రిటన్ పునరుద్ఘాటించింది. యూఎన్‌లో బ్రిటన్ అంబాసిడర్ బార్బారా వుడ్‌వార్డ్ మాట్లాడుతూ.. ఇప్పటికే మా స్టాండ్ ఏంటో తెలియజేశాము. యూఎన్ఎస్‌సీ విస్తరణకు బ్రిటన్ చాలా కాలం క్రితమే ప్రతిపాదన చేసింది. కొత్త శాశ్వత సభ్య దేశాలుగా ఇండియాతో పాటు జర్మని, జపాన్, బ్రెజిల్‌ను చేర్చాలని కోరుతున్నాము. అలాగే ఆఫ్రికన్ దేశాల తరపున ఒక శాశ్వత రిప్రజెంటేషన్ కూడా ఉండాలని బార్బారా తెలిపారు. ఇక నాన్-పర్మనెంట్ సభ్యులుగా ప్రస్తుతం 10 దేశాలు మాత్రమే ఉన్నాయని.. వాటి సంఖ్యను 20కి పెంచాలని బార్బారా సూచించారు.
కాగా, భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే విషయంలో ఇన్నాళ్లూ రష్యా మాత్రమే మద్దతు పలుకుతూ వచ్చింది. గతంలో బ్రిటన్ మద్దతు పలికినా.. తొలిసారి యూఎన్ఎస్‌సీకి అధికారికంగా తెలిపింది. ఇటీవల కాలంలో అమెరికాకు ఇండియా దగ్గర అవుతూ వస్తోంది. ఫ్రాన్స్‌తో కూడా భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇండియాకు వ్యతిరేకంగా చైనా ఓటేసే అవకాశం ఉన్నది. ఐదు శాశ్వత సభ్య దేశాలకు వీటో పవర్ ఉండటంతో.. మిగిలిన నాలుగు దేశాలు ఒప్పుకున్నా.. చైనా మాత్రం భారత్ ఎంట్రీని వీటో పవర్‌తో ఆపేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
చైనా-ఇండియాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తోందని చైనా భావిస్తోంది. పైగా పాకిస్తాన్ కూడా ఒత్తిడి తెచ్చి చైనా వ్యతిరేకంగా ఓటేసేలా చేసే అవకాశం ఉన్నది. అందుకే భద్రతా మండలిలో ముందు వీటో పవర్ రద్దు చేయాలని పలు దేశాలు కోరుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనకు అమెరికా సహకరించే అవకాశం లేదు. వీటో పవర్ ఉంటేనే భద్రతా మండలిలో అమెరికాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆ దేశానికి కూడా తెలుసు. కాబట్టి, ఐదు వీటో దేశాలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.