బ్రిటన్ ప్రధాని రేసులోకి రిషి సునాక్.. వెంటాడుతున్న బోరిస్ జాన్సన్
ప్రధాని పదవి రేసులో తాను గెలవలేని పరిస్థితులు ఉంటే మాత్రం.. మరోసారి సునాక్ ఓటమికి బోరిస్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.
బ్రిటన్ ప్రజలు గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులను చూశారు. ఇంకో వారం, పది రోజుల్లో మరో ప్రధానిని కూడా చూస్తారు. అసలు బ్రిటన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అర్థం కాక సామాన్యులు ఆయోమయానికి గురవుతున్నారు. 2016లో బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ వరుసగా రాజకీయ సంక్షోభాలను ఎదుర్కుంటోంది. ఎంతో కష్టపడి కన్జర్వేటీవ్ పార్టీ ప్రతినిధుల మనసు గెలిచి.. ప్రధాని పీఠం ఎక్కిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే చేతులు ఎత్తేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తర్వాతి ప్రధాని ఎవరవుతారా అనే ఆసక్తి నెలకొన్నది. లిజ్ ట్రస్‌కు గట్టి పోటీ ఇచ్చిన రిషి సునాక్ మరోసారి ప్రధాని రేసులో ఉండబోతున్నారు. కానీ, ఆయన ప్రధాని కాకుండా బోరిస్ జాన్సన్ పావులు కదుపుతున్నారు.
ప్రస్తుతం ప్రధాని రేసులో సునాక్ పేరు ప్రముఖంగా వినపడుతున్నది. ఆయనతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి జెరెమీ హంట్, ప్రతినిధుల సభ నేత పెనీ మోర్డౌంట్, డిఫెన్స్ మినిస్టర్ బెన్ వాలెస్‌లు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుంటోంది. దీన్ని సమర్థవంతంగా పరిష్కరించలేకే ట్రస్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సునాక్ అయితే తన అనుభవంతో ఈ సమస్యను పరిష్కరించగలరని పార్టీ అంచనా వేస్తోంది. పరిస్థితులు గమనిస్తే సునాక్ వైపే ఈ సారి కన్జర్వేటీవ్ పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉన్నది.
ఇంతకు ముందు రిషి సునాక్, లిజ్ ట్రస్ పోటీ పడిన సమయంలో బోరిస్ జాన్సన్ తెర వెనుక రాజకీయం చేశారు. రిషి సునాక్ గెలవకుండా తన వంతు తీవ్ర ప్రయత్నాలు చేసి విజయవంతం అయ్యారు. తన ప్రధాని పదవి పోవడానికి సునాక్ కారణమని కక్ష పెంచుకున్న బోరిస్.. లిజ్ ట్రస్‌కు మద్దతు ఇచ్చి ఆమెను గెలిపించారు. బోరిస్ ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అప్పట్లో సునాక్‌పై కోపంతో ట్రస్‌కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడైతే ఏకంగా తానే రేసులో ఉంటానని చెప్పుకొస్తున్నారు.
ప్రధాని పదవి రేసులో తాను గెలవలేని పరిస్థితులు ఉంటే మాత్రం.. మరోసారి సునాక్ ఓటమికి బోరిస్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్‌లో కన్జర్వేటీవ్ పార్టీకే మెజార్టీ ఉన్నది. ఆ దేశంలో 2025లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు కన్జర్వేటీవ్ పార్టీకి మాత్రమే ప్రధానిని నియమించే అధికారం ఉంటుంది. అయితే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా సునాక్ మొన్న ఓటమిని చవి చూశారు. మరి ఇప్పుడు దేశ అవసరాల దృష్ట్యా సునాక్‌ను ఎన్నుకుంటారా? లేదంటే మరో వ్యక్తిని ప్రధానిని చేస్తారా అనేది చూడాలి.