షార్జాలో అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు భారతీయులు
మృతుల్లో మరొకరు ఇటీవలే పెళ్లి చేసుకుని ఇండియా నుంచి దుబాయ్ వచ్చిన యువతి అని స్థానిక దినపత్రిక ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది.
షార్జాలో ఈ నెల 5వ తేదీన ఆల్ సహాద అనే 39 అంతస్తుల భారీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులున్నారని తాజాగా తేల్చారు. చనిపోయిన ఇద్దరిలో మైకేల్ సత్యదాస్ అనే సౌండ్ ఇంజినీర్ ఒకరు. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో డీఎక్స్‌బీ లైవ్ అనే మ్యూజిక్ కంపెనీలో సత్యదాస్ పని చేస్తున్నారు. మృతుల్లో మరొకరు ఇటీవలే పెళ్లి చేసుకుని ఇండియా నుంచి దుబాయ్ వచ్చిన యువతి అని స్థానిక దినపత్రిక ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది.
రెహ్మాన్ ప్రోగ్రామ్స్‌లో కీలకంగా పనిచేసిన సత్యదాస్
డీఎక్స్‌బీ లైవ్‌లో సత్యదాస్ చాలాకీలకమైన వ్యక్తి అని ఆ సంస్థ తెలిపింది. ఆయన మృతికి సంతాపం తెలిపింది. అంతకుముందు సత్యదాస్ ఏఆర్ రెహ్మాన్, కొలోనియల్ కజిన్స్, డీప్ పర్పుల్ లాంటి బృందాల కాన్సర్ట్స్‌లో చాలా కీలకంగా పని చేశారని ఆయన సోదరుడు డేనియల్ సత్యదాస్ చెప్పారు.
గత నెలలోనే పెళ్లి.. అంతలోనే ఎదురొచ్చిన మృత్యువు
మృతుల్లో మరో భారతీయురాలు 29 ఏళ్ల యువతి. ఆమె ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని, భర్తతో కలిసి అల్ సహాద్‌లో నివాసం ఉంటోంది. ప్రమాదంలో ఆమె చనిపోగా, ఆమె భర్త తీవ్రగాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.