ఆకాశంలో హెలికాప్టర్ల ఢీ : నలుగురి దుర్మరణం
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బీచ్‌కు సమీపంలో ఈ దుర్ఘటన జరగడం, రెండు హెలికాప్టర్లు తునాతునకలు కావడంతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది.
రోడ్ల మీద ప్రమాదాలు జరగడం సాధారణంగా జరిగేదే. అయితే టెక్నాలజీ పెరగడంతో పాటు జనాభా కూడా పెరగడంతో రాబోయే రోజుల్లో ఆకాశంలో కూడా రద్దీ ఉంటుందని, అక్కడ కూడా ఎదురెదురుగా విమానాలు, హెలికాప్టర్లు ఢీకొనే రోజులు వస్తాయని సరదాగా అనుకునేవాళ్లం. అయితే ఆస్ట్రేలియాలో నిజంగానే ఎదురెదురుగా ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు.
ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్ సీ వరల్డ్ థీమ్ పార్క్ బాగా ఫేమస్. అక్కడ ఉన్న మెయిన్ బీచ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ పార్క్, బీచ్‌లను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ పర్యాటకులకు చుట్టు పక్కల ప్రదేశాలను చూపించేందుకు హెలికాప్టర్లు కూడా ఉంటాయి. వివిధ ప్యాకేజీలతో టూరిస్ట్‌లను రైడ్‌కి తీసుకెళ్తూ ఉంటారు.
అలా టూరిస్టులతో బయలుదేరిన రెండు హెలికాప్టర్లు బీచ్‌కు సమీపంలోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు టూరిస్టులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బీచ్‌కు సమీపంలో ఈ దుర్ఘటన జరగడం, రెండు హెలికాప్టర్లు తునాతునకలు కావడంతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది.