ట్విట్టర్ కంపెనీ.. ఎక్స్ యాప్‌లో విలీనం
తాజాగా ట్విట్టర్ ను ఎక్స్ యాప్‌లో విలీనం చేయడం ద్వారా సూపర్ యాప్‌ను రూపొందించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారని తెలుస్తోంది.
ట్విట్టర్ కంపెనీ ఇక కనిపించదు. దానిని ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్.. తన దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా రూపొందించిన `ఎక్స్` యాప్‌లో విలీనం చేశారు. ఈ విషయాన్ని ఒక కేసు నేపథ్యంలో కోర్టుకు ఇచ్చిన సమాచారంలో ఆ సంస్థ వెల్లడించింది. దీనిని ధ్రువీకరించే ఉద్దేశంతో మస్క్ మంగళవారం `X` అనే ఒకే అక్షరంతో ట్వీట్ చేశారు.
ఎక్స్ యాప్ అనేది ఎలాన్ మస్క్ దీర్ఘకాల ప్రణాళిక. ఈ విషయాన్ని ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ తుదిదశలో ఉండగానే ఆయన వెల్లడించారు. ఎక్స్ యాప్ రూపకల్పనను ట్విట్టర్ వేగవంతం చేస్తుందని ఆయన తెలిపారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయడం ద్వారా ఎక్స్ యాప్ 3 నుంచి 5 సంవత్సరాలు ముందుకెళుతుందని గతేడాది అక్టోబర్‌లో ఆయన ట్వీట్ చేశారు.
చైనాలో మెసేజింగ్, కాలింగ్, చెల్లింపులు, ఇతరత్రా కార్యకలాపాలన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అదే `వీ చాట్`. ఆ తరహాలో ఉండాలనే `ఎక్స్ యాప్`ను మస్క్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఎక్స్ పేరుతో మస్క్ 1999లోనే ఒక ఆన్‌లైన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దానిని పేపాల్‌లో విలీనం చేశారు. ఆపైన ఎక్స్.కామ్ అనే డొమైన్‌ను ఆయన కొనుగోలు చేశారు.
తాజాగా ట్విట్టర్ ను ఎక్స్ యాప్‌లో విలీనం చేయడం ద్వారా సూపర్ యాప్‌ను రూపొందించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు.