శిథిలాల కిందే ఇంకా వేలాది మంది..! - తుర్కియే, సిరియా భూకంప ఘటనలో 15,383కు చేరిన మృతుల సంఖ్య
భూకంప ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్నది తుర్కియేనే. ఆ దేశంలోని దాదాపు 10 ప్రావిన్స్‌లు ఇప్పుడు నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. ఒక్కో భవన శిథిలాల కింద 500 నుంచి 600 మంది చిక్కుకుపోయి ఉన్నారు.
తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం నాటి భూకంప ప్రభావానికి అక్కడి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. నేటికీ అక్కడి శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుని ఉన్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగానే ఉందని వారు పేర్కొంటున్నారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క తుర్కియేలోనే ఇప్పటివరకు 12,391 మంది మృతిచెందగా, సిరియాలో 2,992 మంది చనిపోయారు. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 15,383 మంది మృతిచెందినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. సమయం గడుస్తున్నకొద్దీ మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బలగాలు సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నప్పటికీ ఇప్పటికీ వరుసగా వస్తున్న ప్రకంపనలు, వాతావరణ పరిస్థితులు ఆటంకం కలిగిస్తున్నాయి.
భూకంప ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్నది తుర్కియేనే. ఆ దేశంలోని దాదాపు 10 ప్రావిన్స్‌లు ఇప్పుడు నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. ఒక్కో భవన శిథిలాల కింద 500 నుంచి 600 మంది చిక్కుకుపోయి ఉన్నారు. వారిని కాపాడేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది కూడా అతి తక్కువ సంఖ్యలోనే ఉండటంతో అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సహాయక చర్యల కోసం అక్కడ కనీసం 10 మంది సిబ్బంది కూడా లేరంటే అక్కడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించిన ఆ దేశ అధ్యక్షుడు రెసెస్ తయ్యిప్ ఎర్డోగాన్.. సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించారు. ఇలాంటి ఘోర విపత్తును ముందే ఊహించి సిద్ధంగా ఉండటం సాధ్యమయ్యే పని కాదని ఆయన తెలిపారు.