Telugu Global
International

ప్రతీకార పన్ను తప్పదంటూ భారత్‌కు ట్రంప్‌ హెచ్చరిక

ఒకవేళ భారత్‌ 100 శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్‌ చేయకూడదా? ప్రశ్నించిన డొనాల్డ్‌ ట్రంప్‌

ప్రతీకార పన్ను తప్పదంటూ భారత్‌కు ట్రంప్‌ హెచ్చరిక
X

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమౌతున్న రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి భారత్‌ 'సుంకాల' అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ మళ్లీ హెచ్చరికలు చేశారు. ఫ్లొరిడాలోని తన ఎస్టేట్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఉత్పత్తులపై భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నాయి. 100,200 శాతం పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతి చర్య ఉంటుంది. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్‌ 100 శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్‌ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలు చేయడం అనేది వారి ఇష్టమే. కానీ మేం కూడా అలాగే స్పందిస్తామని ట్రంప్‌ వివరించారు.

అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా ట్రంప్‌ పలుమార్లు సుంకాల అంశంపై ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ హెచ్చరించారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

2019లో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నసమయంలో భారత్‌ను ఆయన 'టారిఫ్‌ కింగ్‌' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌కు జీఎస్‌పీ (జనరలైజ్డ్‌, సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌) ని రద్దు చేశారు. ఈ హోదా వల్ల భారత మార్కెట్లలో సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని అప్పట్లో ఆయన ఆరోపించారు. జీఎస్‌పీ కింద అమెరికాకు అర్హత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు సుంకంరహిత ఎగుమతులు చేయడాఆనికి వీలుంటుంది. అయితే ఈ హోదాను పునరుద్ధరించడానికి రెండు దేశాల మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి.

First Published:  18 Dec 2024 8:29 AM IST
Next Story