డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం
మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను వెనక్కి తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే.. తనదైన స్టైల్‌లో పాలన మొదలుపెట్టారు. ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. తొలి ఎనిమిది ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరేసి ఉత్సాహపరిచారు. దీంతోపాటు మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విదుల్లో హాజరుకావాలన్న ఆదేశాలున్నాయి. అంతేకాదు.. కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటమ్ జారీ చేశారు.
క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో 1500 మందికి క్షమాభిక్ష
దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా సంస్థ నుంచి అమెరికా వైదొలిగింది. ఈ మేరకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలిగించారు. గత అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏఐ అభివృద్ధి, ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి. సరిహద్దు గోడ సామాగ్రిని విక్రయించాలన్న బైడెన్ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామాగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు.
టిక్‌టాక్‌కు 75 రోజుల సమయం
చైనా కంపెనీ టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించడానికి ట్రంప్ ప్రభుత్వం 75 రోజుల సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. అమెరికాకు ఆ యాప్‌లో 50 శాతం వాటా ఉండాలని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ దీనిని విక్రయించడానికి జనవరి 19 వరకు గడువు ఇచ్చిన విషయం విదితమే. బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడాన్ని ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, డైరెక్టేరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మస్క్ కు షాక్ ఇచ్చిన ట్రంప్
విద్యుత్ వాహనాలపై ట్రంప్ నిర్ణయం ఎలక్టికల్ కార్ల కంపెనీ టెస్లా యజమాని మస్క్‌ను కొంత షాక్ కు గురిచేసింది. 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50 శాతం విద్యుత్ వాహనాలు ఉండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలిగించారు.