రేప్ కేసులో ట్రంప్ రివర్స్ ఎటాక్.. - ఆరోపణలు చేస్తున్న కాలమిస్టుపై పరువు నష్టం దావా
పిటీషన్ దాఖలైన రెండు వారాలకు ట్రంప్ ఆమెపై రివర్స్ పిటీషన్ వేశారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న మహిళకు నష్టపరిహారం విధించడంతో పాటు ఆమెకు శిక్ష వేయాలని ఆయన ఆ పిటీషన్‌లో కోరారు.
తనను రేప్ చేశాడంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మహిళా కాలమిస్టు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఆమెపై తాజాగా ట్రంప్ రివర్స్ కేసు దాఖలు చేశారు. ఆయన న్యాయవాదులు మంగళవారం సాయంత్రం ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అత్యాచారం జరిగిందన్న ఆమె వాదనతో జ్యూరీ ఏకీభవించకపోయినా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్‌లో అందులో ఆరోపించారు.
1996లో తనపై ట్రంప్ అత్యాచారం చేశారంటూ కాలమిస్టు గతంలో కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు రేప్ జరగలేదని నిర్ధారించింది. అయితే ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినందున బాధితురాలికి 5 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని ఆయన్ని ఆదేశించింది.
ఆ మహిళా కాలమిస్టు కోర్టులో మరోసారి పిటీషన్ వేశారు. తనకు న్యాయం చేయాలని, 10 మిలియన్ డాలర్ల పరిహారం ఇప్పించాలని, ట్రంప్ వ్యాఖ్యలకు మరింత నష్ట పరిహారం ఇవ్వాలని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ దాఖలైన రెండు వారాలకు ట్రంప్ ఆమెపై రివర్స్ పిటీషన్ వేశారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న మహిళకు నష్టపరిహారం విధించడంతో పాటు ఆమెకు శిక్ష వేయాలని ఆయన ఆ పిటీషన్‌లో కోరారు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండు చేశారు.