ఎలిజబెత్ 2 చనిపోయే డేట్ ముందే చెప్పిన వ్యక్తిపై ట్రోలింగ్
ఈ ఏడాది జూన్ 7న లోగన్ స్మిత్ అనే వ్యక్తి బ్రిటన్ రాణి ఏ రోజు మరణిస్తుందో, ఆమె వారసుడు కింగ్ చార్లెస్ ఎప్పుడు చనిపోతాడో ట్వీట్ చేశాడు. అతను ట్వీట్ చేసినట్లుగానే సెప్టెంబర్ 8న రాణి మరణించింది.
సోషల్ మీడియాలో ఎవరు? ఎప్పుడు? ఫేమస్ అవుతారో చెప్పలేం. ఇప్పుడు అలాగే ఓ అనామకుడు ఫేమస్ అవడమే కాకుండా.. ట్రోలింగ్‌కు కూడా గురవుతున్నాడు. ఏవో అతీత శక్తులు ఉన్నట్లు రెండు నెలల క్రితం క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8న చనిపోతుంది అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా చార్లెస్-3 రాజు 2026 మార్చి 28న చనిపోతాడు అని కూడా గెస్ చేశాడు. @Logan_Smith526 అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ ఏడాది జూన్ 7న లోగన్ స్మిత్ అనే వ్యక్తి బ్రిటన్ రాణి ఏ రోజు మరణిస్తుందో, ఆమె వారసుడు కింగ్ చార్లెస్ ఎప్పుడు చనిపోతాడో ట్వీట్ చేశాడు. అతను ట్వీట్ చేసినట్లుగానే సెప్టెంబర్ 8న రాణి మరణించింది. దీంతో చార్లెస్-3 డెత్ డేట్ కూడా నిజమే అవుతుందని కొంత మంది అంటున్నారు. కొంత మంది బ్రిటన్ పౌరులు లోగన్ స్మిత్‌ను ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా, సదరు వ్యక్తి మాత్రం ఆ ట్వీట్‌ను ప్రైవేట్ మోడ్‌లో పెట్టేశాడు. కానీ తన అకౌంట్ డిస్క్రిప్షన్‌లో మాత్రం అలాగే ఉంచేశాడు. చాలా మంది ఆ ట్వీట్ స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేస్తున్నారు.
కాగా, మరో వ్యక్తి లోగన్ స్మిత్ ట్వీట్లపై అసలు నిజం బయటపెట్టాడు. స్మిత్ ఇలాగే ఫేమస్ వ్యక్తుల మరణాల డేట్ ప్రిడిక్షన్ అని చెప్పి ట్వీట్లు చేస్తుంటాడని, అలా ఎన్నో సార్లు రాణి మరణం గురించి ట్వీట్ చేసి.. ఆ తర్వాత డిలీట్ చేశాడని చెప్పుకొచ్చాడు. గతంలో ఫిబ్రవరి 13న రాణి మరణిస్తుందని ట్వీట్ చేశాడు. కానీ ఆమె ఆరోగ్యంగానే ఉండటంతో ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. రెండు నెలల క్రితం రాణి సెప్టెంబర్ 8న మరణిస్తుందని మరో ట్వీట్ చేశాడు. అది నిజం కావడంతో అలాగే ఉంచేశాడు. కేవలం నోటికొచ్చిన డేట్ వేసి.. అది నిజం కావడంతోనే ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అంతే కానీ లోగన్ స్మిత్ ఏమీ నోస్ట్రడామస్ కాదు అని చెప్పుకొచ్చాడు.
లోగన్ స్మిత్‌పై ట్విట్టర్ యూజర్లు ఫిర్యాదు చేయడంతో ఆ ట్వీట్‌ను హైడ్ చేసింది. మరోవైపు ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని బ్రిటన్ పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం. రాజకుటుంబానికి చెందిన వ్యక్తులపై ఇలా ట్వీట్లు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బతికి ఉన్న చార్లెస్-3ని కూడా వదలకుండా ప్రిడిక్షన్ చేస్తుండటంపై బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా సరదాగా చేసే ట్వీట్లు కూడా మెడకు చుట్టుకుంటాయనే విషయం లోగన్ స్మిత్ విషయంలో మరోసారి రుజువైంది.