యూఎస్‌లో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి - అత్యవసర సాయం అందిస్తామని జో బైడెన్ ప్రకటన
టోర్నడోల బీభత్సానికి మిసిసిపీ, అలబామా, టెన్నసీలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 24 గంటల వ్యవధిలో 11 టోర్నడోలు నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.
అమెరికాలో పలు పట్టణాలు టోర్నడోల బీభత్సానికి వణికిపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, చెట్లు నేలవాలడం, కార్లు బోల్తా కొట్టడం, కంచెలు కూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ బీభత్సం వల్ల పలు ప్రాంతాల్లో 23 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారని వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు.
టోర్నడోల బీభత్సానికి మిసిసిపీ, అలబామా, టెన్నసీలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 24 గంటల వ్యవధిలో 11 టోర్నడోలు నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావం వల్ల అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు.
మిసిసిప్పీలోని అనేక పట్టణాలు టోర్నడోల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. పూర్తిస్థాయిలో సర్వే జరిగే వరకు కచ్చితమైన నష్టం అంచనాలు చెప్పలేమని వారు వివరించారు. శనివారం తెల్లవారుజాముతో టోర్నడోల ప్రభావం తగ్గిందని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. అవి తీవ్రంగా ఉండే అవకాశం లేదని తెలిపారు. శనివారం దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాధితులకు అత్యవసర సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు.