మాస్కోకు మద్దతుగా వెళ్తే వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగి వెళ్తాయి
ఉత్తర కొరియాకు అమెరికా వార్నింగ్..బెదిరింపులకు పాల్పడితే.. మేమూ వాటికి సమాధానం ఇస్తామన్నకీవ్
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తరకొరియా రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను తరలిస్తున్నట్లుగా దక్షిణ కొరియా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా బలగాలకు అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఒకటి, రెండుసార్లు ఆలోచించి బరిలోకి దిగాలంటూ సూచించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ వ్యాఖ్యానించారు. 'రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగి వెళ్తాయి. కాబట్టి బరిలోకి దిగేముందు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి' అని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరును ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇవ్వడం విశేషం.
ఐరాసాలో అమెరికా వర్సెస్ రష్యా
మరోవైపు మాస్కోకు ఉత్తర కొరియా బలగాలు పంపడంపై ఐరాసలో మాటల యుద్ధం జరిగింది. పాశ్చాత్య దేశాలు కీవ్‌కు సాయం అందిస్తున్నప్పుడు మాస్కోకు ఉత్తర కొరియా వంటి మిత్రదేశాలు సహాయం అందించకూడదా? అని ఐరాసాలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ప్రశ్నించారు. ఉత్తర కొరియాతో రష్యా సైనిక పరస్పర చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదు. రష్యా, ఉత్తర కొరియాల మధ్య సహకారం గురించి మా పశ్చిమ సహచరులు చెబుతున్నదంతా నిజమే. అయినప్పటికీ.. జెలెన్ స్కీ పాలనకు సహాయం చేసే హక్కు తమకు ఉందని అమెరికాతో సహా దాని మిత్ర దేశాలు లోపభూయిష్ట తార్కాణాన్ని ప్రతి ఒక్కరిపైనా విధించడానికి ఎందుకు యత్నిస్తున్నాయి? రష్యా మిత్ర పక్షాలకు ఆ హక్కు ఎందుకు లేదు? అని నిలదీశారు. ఈ సందర్భంగా 2022 నుంచి ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో కిమ్ దళాల ప్రమేయం ఉందనే వాదనలను ఖండించారు.
బెదిరింపులకు పాల్పడితే.. వాటికి సమాధానం ఇస్తాం: కీవ్
ఈ వ్యాఖ్యలపై కీవ్ ఐరాస రాయబారి సెర్గి కిస్లిట్యా స్పందించారు. ఉక్రెయిన్‌కు సహాయం అందించే దేశాలు భద్రతామండలిలో ఆంక్షలను ఉల్లంఘించలేదన్నారు. ఇదిలాఉండగా.. రష్యాకు తమ దళాలను పంపుతున్నట్లు ఉత్తర కొరియా ఇప్పటివరకు అంగీకరించలేదు. అయితే అలాంటి చర్య ఏదైనా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నది. 'అమెరికా, పాశ్చాత్య దేశాల రష్యా సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు బహిర్గతం చేయడం, బెదిరింపులకు పాల్పడితే.. మేము వాటికి సమాధానం ఇస్తాం. అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం. పోంగ్యాంగ్, మాస్కో పరస్పర భద్రత, అభివృద్ధిపై సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయి' అని ఉత్తర కొరియా ఐరాస రాయబారి సాంగ్ కిమ్ కౌన్సిల్ పేర్కొన్నారు.