తుర్కియే, సిరియా భూకంప మృతులు.. 20 వేలకు పైనే..! - ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా
ఈ భూకంప ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. తుర్కియేలోని గాజియాన్‌తెప్ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు
ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన తుర్కియే, సిరియాల్లో జరిగిన భూకంప ఘటనలో మృతులు 20 వేల మందికి పైనే ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. ఇప్పటికే తుర్కియేలో 3 వేల మందికి పైగా, సిరియాలో 1,500 మందికి పైగా మృతిచెందినట్టు అక్కడి మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా 4,500 మందికి పైగా ఈ ఘటనలో ఇప్పటివరకు మృతిచెందినట్టు వెల్లడైంది.
శిథిలాల తవ్వకాల్లో మృతదేహాలను వెలికితీస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇరు దేశాల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండగా, గాయపడినవారు 20 వేల మందికి పైనే ఉన్నారని తెలుస్తోంది. వారిలో తుర్కియేలో సుమారు 15 వేల మంది, సిరియాలో 5 వేల మందికి పైగా గాయపడినట్టు సమాచారం. తీవ్ర గాయాలపాలైన వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ భూకంప ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. తుర్కియేలోని గాజియాన్‌తెప్ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత దాదాపు 50 శక్తిమంతమైన ప్రకంపనలు ఇరు దేశాలనూ తాకాయి. దీంతో ఇరు దేశాలూ వణికిపోయాయి. ఆ ప్రకంపనల్లో ఒక దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.5గా నమోదు కావడం గమనార్హం.
సోమవారం జరిగిన ఈ భూకంప ఘటనలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఒక్క తుర్కియేలోనే 5,600 భవనాలు కుప్పకూలాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అక్కడి అధికార వర్గాలు రక్షణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు.