ఏడు రూపాయల పెన్ను.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది?
బాల్‌పాయింట్ పెన్ను కనిపెట్టిన రెనాల్డ్స్ పేరు గుర్తుండిపోయేలా తమ కంపెనీకి రెనాల్డ్స్ అని పేరు పెట్టుకున్న ఈ కంపెనీ 1945 అక్టోబర్ 29న 045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్ పెన్నును మార్కెట్లోకి విడుదల చేసింది.
1980-90వ దశకాల్లో పుట్టిన పిల్లందరికీ ఫేవరెట్ పెన్ను 045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్. ఆ పెన్ తయారీని కంపెనీ ఆపేస్తోందంటూ 90s kid పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నిన్న సాయంత్రం వచ్చిన ట్వీట్ సంచలనం రేపుతోంది. దాన్ని ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా చూశారు. 43 వేల మంది లైక్ చేశారు. 4,756 మంది రీపోస్ట్ చేశారు. కేవలం ఏడే రూపాయల ఖరీదైన ఆ పెన్ను గురించి ఇంత హంగామా అని అనుకుంటే దాని చరిత్ర మీద ఓ లుక్కేయాల్సింది.
Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era.. pic.twitter.com/pSU4WoB5gt
— 90skid (@memorable_90s) August 24, 2023
80 ఏళ్ల కిందట లాంచ్
బాల్‌పాయింట్ పెన్ను కనిపెట్టిన రెనాల్డ్స్ పేరు గుర్తుండిపోయేలా తమ కంపెనీకి రెనాల్డ్స్ అని పేరు పెట్టుకున్న ఈ కంపెనీ 1945 అక్టోబర్ 29న 045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్ పెన్నును మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూయార్క్‌లోని 32వ స్ట్రీట్ స్టోర్‌లో ఆ పెన్ను ఆ రోజు రిలీజ్ అవగానే ఓ సంచలనం సృష్టించింది. విడుదలైన రోజు దాదాపు 5వేల మంది పెన్నుల షాపు ఓనర్లే వాటిని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్లను కంట్రోల్ చేయడానికి 50 మందిని అధికారులను పంపాల్సి వచ్చిందంటే అదెంత సెన్సేషనల్ స్టార్ట్ అనేది అర్థమవుతుంది.
ఇండియాలో 1980ల్లో హంగామా
ఆ పెన్ను తర్వాత కొన్ని దశాబ్దాలకు అంటే 1980ల్లో ఇండియన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. నాలుగున్నర, ఐదు రూపాయలతో ఆ రోజుల్లో అది అత్యంత కాస్ట్‌లీ పెన్ను. అందుకే 1980 చివర్లో ఆ పెన్ను తొలిసారిగా స్కూల్‌కు తెచ్చిన పిల్లలకు హీరో వర్షిప్ ఉండేది. ఒకసారి రాసిస్తా ఇవ్వవా.. ప్లీజ్.. అని తోటి పిల్లలు అడిగేంత క్రేజ్ ఉండేది. ఇంకుపెన్నులు, బండగా రాసే బాల్ పెన్నులతో కుస్తీ పట్టే పిల్లలు రెనాల్డ్స్ పెన్నుతో సన్నగా, ముత్యాల్లాంటి రాత రాయడానికి అలవాటుపడ్డారు. ఒకసారి పెన్ను కొంటే దాదాపు నెల్లాళ్లు దానితో రాసుకోగలిగే భారీ రీఫిల్ దాని సొంతం. అప్పటి పిల్లలు ఇప్పుడు 40, 50 సంవత్సరాల వయసుకొచ్చినవారు కూడా చాలామంది ఆ పెన్నునే వాడుతున్నారు. అలాంటి పెన్ను తయారీని ఆపేస్తారన్న వార్త ట్విట్టర్ ఎక్స్‌లో ట్రెండ్ అవడంతో కొందరు ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆ పెన్ను తయారీని ఆపట్లేదని, మీ ఫేవరెట్ పెన్ను ఎప్పటిలాగే మార్కెట్లో దొరుకుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ పెన్ ఖరీదు కేవలం ఏడు రూపాయలే కావడం మరో విశేషం.
*