గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ జాఫ్రీ హింటన్ గూగుల్‌కు రాజీనామా
ఈ టెక్నాలజీ విషయంలో ఇప్పటినుంచే మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని హింటన్ తెలిపారు. మనం ఏది నిజమో తెలుసుకోలేని ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఏఐకి ఉందని ఆయన హెచ్చరించారు.
గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)గా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్.. గూగుల్‌కి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన ధ్రువీకరించారు. గత వారమే తాను గూగుల్‌ను విడిచిపెట్టినట్టు ఆయన వెల్లడించారు. గూగుల్‌ను ప్రత్యేకంగా విమర్శించాలనే కోరికతో కాకుండా AI వల్ల కలిగే నష్టాల గురించి స్వేచ్ఛగా మాట్లాడగలనని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.
ఏఐ వంటి టెక్నాలజీలు ప్రస్తుతానికి మనుషుల కన్నా తెలివైనవి కావని.. కానీ త్వరలోనే అవి మనుషుల తెలివితేటలను అధిగమించే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్టు హింటన్ తెలిపారు. జీపీటీ 4 వంటివి ఇప్పటికే జనరల్ నాలెడ్జ్ విషయంలో మనుషులను దాటేశాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైతే తార్కిక జ్ఞానం విషయంలో అవి మనుషుల కంటే వెనుకబడి ఉన్నప్పటికీ.. త్వరలోనే ఆ విషయంలోనూ మెరుగవుతాయని స్పష్టం చేశారు.
ఈ టెక్నాలజీ విషయంలో ఇప్పటినుంచే మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని హింటన్ తెలిపారు. మనం ఏది నిజమో తెలుసుకోలేని ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఏఐకి ఉందని ఆయన హెచ్చరించారు. ఫేక్ ఫొటోలు, నకిలీ సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించారు. ఈ టెక్నాలజీని దుర్వినియోగం కాకుండా కట్టడి చేయడం చాలా కష్టమని ఆయన చెప్పారు.
గూగుల్ సంస్థ ఏఐ పరిశోధనల్లో హింటన్ దశాబ్దానికి పైగా సేవలందించారు. 2012లో ఇద్దరు గ్రాడ్యుయేట్ విద్యార్థులతో కలిసి ఆయన దీనిపై విస్తృత పరిశోధనలు చేశారు. న్యూరల్ నెట్‌వర్క్‌పై హింటన్ జరిపిన పరిశోధనలు ఏఐ వ్యవస్థల రూపురేఖలనే మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి అనేక ఉత్పత్తుల వెనుక వీటి పాత్ర కీలకం. ఆయనతో కలిసి పనిచేసిన విద్యార్థుల్లో ఒకరు ఇప్పుడు చాట్ జీపీటీ సృష్టికర్త అయిన ఓపెన్ ఏఐలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారని ఓ మీడియా సంస్థ వెల్లడించడం గమనార్హం.
గత మార్చిలో టెక్‌లోని కొంతమంది ప్రముఖులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లకు కనీసం ఆరు నెలల పాటు అత్యంత శక్తివంతమైన AI సిస్టమ్‌ల శిక్షణను నిలిపివేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమాజానికి, మానవాళికి ఇది తీవ్ర ప్రమాదంగా మారుతుందని వారు అప్పట్లో పేర్కొన్నారు.