Telugu Global
International

ఉద్యోగుల తొలిగింపుపై ట్రంప్‌ ఆదేశాలకు కోర్టు షాక్‌

తొలిగింపు ఉత్తర్వులను తక్షణమే ఉప సంహరించుకోవాలని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి విలయం అల్సప్‌ ఆదేశం

ఉద్యోగుల తొలిగింపుపై ట్రంప్‌ ఆదేశాలకు కోర్టు షాక్‌
X

అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున కోతలు విధిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. భారీ సంఖ్యలో ఫెడరల్‌ ఉద్యోగులను తొలిగిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి విలయం అల్సప్‌ అడ్డుకున్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్‌ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తొలిగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.

ఉద్యోగుల కోతలపై ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొన్ని కార్మిక యూనియన్లు కోర్టును ఆశ్రయించాయి. పలు ఏజెన్సీల్లో సుమారు ప్రొబేషనరీ సిబ్బంది అందర్నీ తొలిగిస్తున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి అల్సప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ కార్యాలయానికి తన సొంత సిబ్బందిని తొలిగించే హక్కు ఉన్నది గానీ.. ఇతర విభాగాల్లో కోతలు విధించే అధికారం లేదు. ఫెడరల్‌ ఏజెన్సీలే తన విభాగాల్లో సిబ్బంది నియామకాలు, తొలిగింపులు నిర్వహించుకునేలా కాంగ్రెస్‌ వాటికి అధికారం కల్పించింది. కోతలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణక్ష్మీం చట్టవ్యతిరేకంగా కనిపిస్తున్నది' అని న్యాయమూర్తి వెల్లడించారు.

అమెరికా ప్రభుత్వానికి చెందిన పలు ఫెడరల్‌ ఏజెన్సీలో దాదాపు 2 లక్షల మంది ఫెడరల్‌ ఉద్యోగులు ఉన్నారు. వారిలో చాలామందిని విధుల నుంచి తొలిగించాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ నిర్ణయించింది. అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్‌ ఉద్యోగులను తొలిగించాలని డోజ్‌ శాఖ సూచించింది. దీనికి అమెరికా అధ్యక్షుడు కూడా మద్దతు తెలిపారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది. తాజా కోర్టు ఆదేశాలతో వారికి తాత్కాలిక ఊరట లభించినట్లయింది.

First Published:  28 Feb 2025 11:00 AM IST
Next Story