కంట్రోల్ తప్పితే.. ఏఐ హానికరం.. - గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
ఏఐతో వచ్చే దుష్ప్రభావాలను తలుచుకుంటే తనకు నిద్ర కూడా పట్టడం లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు
కంట్రోల్ తప్పితే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంత సేఫ్ కాదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఓ ఇంటర్నేషనల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సరిగ్గా వినియోగించకపోతే.. అది చాలా హానికర పరిణామాలకు దారి తీసుకొస్తుందని తెలిపారు.
ఏఐతో వచ్చే దుష్ప్రభావాలను తలుచుకుంటే తనకు నిద్ర కూడా పట్టడం లేదని సుందర్ పిచాయ్ వెల్లడించారు. టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయని, కొత్త సాంకేతికతను అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించారు. దీంతో దానిని అలవర్చుకునే సమయం కూడా సమాజానికి దొరకడం లేదని చెప్పారు. ఇది సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ శరవేగంగా పెరుగుతున్న క్రమంలో దానిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అంతర్జాతీయ కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. అది ఏ స్థాయిలో అంటే.. అణ్వాయుధాల కార్యాచరణ మాదిరిగా ఉండాలని వివరించారు.