Telugu Global
International

శ్రీలంకలో ఉద్యమకారులపై ఉక్కుపాదం...అర్దరాత్రి సైన్యం దాడి

శ్రీలంకలో ఉద్యమకారులపై ఉక్కుపాదం...అర్దరాత్రి సైన్యం దాడి
X

శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నంతపని చేశాడు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపాడు. పార్లమెంటు ఎదుట నిరసన తెలుపుతున్న ప్రజలపై అర్దరాత్రి సైన్యం, పోలీసులు దాడి చేశారు. నిరాయుధ నిరసనకారులపై లాఠీలు జుళిపించారు. టెంట్లను కూల్చేశారు. వందలమంది నిరసనకారులను నిర్బంధించారు. అధ్యక్ష కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఏర్పాటు చేసిన అన్ని టెంట్లను సైన్యం ధ్వంసం చేసింది.

రణీల్ విక్రమ సింఘే అధ్యక్షుడవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గొటబయ రాజపక్సేకు మద్దతుదారైన రణిల్ అధ్యక్షుడైతే శ్రీలంకకు ఒరిగేదేం లేదని కాబట్టి ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. శాంతి యుత నిరసనలు తెలపడానికి తమకు అవకాశం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే మొదటి నుంచీ నిరసనల పట్ల వ్యతిరేకంగా ఉన్న రణిల్ విక్రమసింఘే తాను అధికారంలోకి రాగానే నిరసనలను అణిచివేస్తానని బహిరంగంగానే ప్రకటించి ఇప్పుడు అన్నంత పని చేశాడు. సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చాడు. శాంతి భద్రతలకు భంగం కలిగించేవాళ్ళను కాల్చిపడేయమని ఆదేశాలిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఈ అర్దరాత్రి సైన్యం ఆందోళనకారులపై దాడులకు పూనుకొంది.


కాగా తమపై ఎన్ని అణిచివేతలకు పాల్పడ్డా తమ పోరాటం ఆపబోమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. 'ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మాకు విజయం సాధ్యమవుతుంది.' అని నిరసన బృందాల ప్రతినిధి లాహిరు వీరసేకర పేర్కొన్నారు.

First Published:  22 July 2022 9:45 AM IST
Next Story