శ్రీలంక కీలక నిర్ణయం.. భారత్ సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు
ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని మంత్రి అలీ సబ్రా తెలిపారు.
శ్రీలంకలో పర్యాటక ప్రదేశాలను వీక్షించాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్. అదేమిటంటే.. ఇకపై శ్రీలంక వెళ్లాలంటే టూరిస్టులు వీసాకు రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రా వెల్లడించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా ఫీజు రద్దు చేయాలని శ్రీలంక కేబినెట్ నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. భారత్‌తో పాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు ఇందులో ఉన్నాయి.
శ్రీలంక ద్వీప దేశమనే విషయం తెలిసిందే. దీనికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే కావడం గమనార్హం. ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరేది కూడా పర్యాటకుల ద్వారానే. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కోవిడ్–19 పరిస్థితులతో పాటు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం వల్ల పర్యాటకుల రాక భారీగా తగ్గింది.ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి మళ్లీ ఊపిరి పోయాలని భావించిన ఆ దేశం దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని మంత్రి అలీ సబ్రా తెలిపారు. 2023 సంవత్సరానికి గాను 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీలంక.. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తాజాగా ఫ్రీ వీసా నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ సమావేశంలోనే ఈ అంశం చర్చకు రాగా, తొలుత 5 దేశాలకు వీసా రుసుము రద్దు చేయాలని భావించింది. ఇప్పుడు దానిని 7 దేశాలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. శ్రీలంక నిర్ణయంతో ఆయా దేశాల టూరిస్ట్ లకు ఉచిత వీసా లభిస్తుంది.