Telugu Global
International

మౌనంగా ఉన్నందుకు క్షమించండి

బంగ్లా దేశీయులను కోరిన షకీబ్‌ అల్‌ హసన్‌

మౌనంగా ఉన్నందుకు క్షమించండి
X

బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లపై తాను మౌనంగా ఉన్నందుకు క్షమించాలని ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌ లో అల్లర్లపై ఆయన తొలిసారిగా నోరు విప్పారు. ''దేశం కోసం ప్రాణాలర్పించిన విద్యార్థులకు సంతాపం తెలుపుతున్నా.. దేశంలో తలెత్తిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా.. ఇష్టమైన వాళ్లను కోల్పోయిన వారి బాధను ఏ పరిహారం కూడా తీర్చలేదు.. సోదరుడిని, కుమారుడిని నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తోడుండేందుకు ప్రయత్నిస్తా.. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు తాను మౌనంగా ఉండటం చాలా మందిని బాధించింది.. వారి మనోభావాలను తాను అర్థం చేసుకోగలను.. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరునా క్షమాపణలు చెప్తున్నా.. నేను మీ స్థానంలో ఉన్నా కూడా చాలా నిరాశకు గురయ్యే వాడిని'' అని బంగ్లాదేశీయులనుద్దేశించి ఆయన లేఖ విడుదల చేశారు. ఇటీవల భారత పర్యటనలో పాల్గొన్న బంగ్లాదేశ్‌ టీమ్‌ తరపున చివరి టీ 20, టెస్ట్‌ మ్యాచ్‌ లు ఆడేసిన షకీబ్‌ ఆ రెండు ఫార్మాట్ల క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పేశారు. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ లో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు వీడ్కోలు పలుకుతానని.. అందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తిని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. క్రికెట్‌ ఆడుతూనే షకీబ్‌ అల్‌ హసన్‌ అవామీ లీగ్‌ పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా విజయం సాధించారు. షేక్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లతో ఆమె పార్టీకి చెందిన షకీబ్‌ స్వదేశానికి తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అల్లర్లలో ఓ యువకుడు మృతిచెందగా, అందుకు షేక్‌ హసీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన షకీబ్‌ కూడా కారణమని ఆయన తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ కారణాలతో షకీబ్‌ మరికొన్నాళ్ల పాటు స్వదేశంలో అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి.

First Published:  11 Oct 2024 8:06 AM GMT
Next Story