ఇజ్రాయెల్ దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా అల్లుడి మృతి
సిరియాలోని డమాస్కస్‌లోని మజ్జే జిల్లాలో అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్-ఖాసిర్ మృతి
హెజ్‌బొల్లా కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గత వారం రోజులుగా బీరుట్‌లో దాడులు చేస్తున్నది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లోనే ఆయన కుమార్తె మృతి చెందింది. తాజాగా నస్రల్లా అల్లుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.సిరియాలోని డమాస్కస్‌లోని మజ్జే జిల్లాలో అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇద్దరు లెబనాన్‌లు మృతి చెందారు. వారితో పాటు హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్-ఖాసిర్ కూడా మరణించినట్లుల సిరియాన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది. అలాగే హెజ్‌బొల్లాకు చెందిన ఓ మీడియా కూడా దీన్ని ధృవీకరించింది. ఇజ్రాయెల్ దళాలు బీరుట్‌పై జరిపిన తాజా దాడిలో ఆరుగురు మృతి చెందారు. దాహియాలో హెజ్‌బిల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన ప్రదేశంలోనే క్షిపణులతో దాడి చేసింది.
51 మంది మృతి.. 82 మందికి గాయాలు
గత రెండు రోజులుగా లెబనాన్ సరిహద్దులోని సుమారు 50 గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది. మరోవైపు లెబనాన్‌లో సైనిక చర్యను కొనసాగిస్తే ఇజ్రాయెల్‌కు గట్టి జవాబు చెప్పాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. తమ భద్రతకు విఘాతం కలిగిస్తే ఇజ్రాయెల్‌ను భద్రతను దెబ్బతీసే సత్తా తమకు ఉందని ఇరాన్ పేర్కొన్నది. ఒకవైపు లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోవైపు గాజా, సిరియాలపైనా దాడులు చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 51 మంది గాజా పౌరులు దుర్మరణం పాలవ్వగా.. 82 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అటు సిరియాలోని ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని పలు ప్రాంతాలపై సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో నాలుగు అంతస్థుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ సెన్యం ఇంకా ధృవీకరించలేదు.
అమెరికా పౌరుడు మృతి
మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికాకు చెందిన పౌరుడు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. వాషింగ్టన్-మిచిగాన్‌లోని డియర్‌బోర్న్‌కు చెందిన కమెల్ అహ్మద్ జావెద్ మృతి చెందినట్లు అమెరికా వెల్లడించింది. ఆయన మృతి తమను ఎంతో బాధకు గురిచేసిందని వైట్‌హౌస్ ప్రకటించింది. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.
ఇరాక్‌లో 100 మంది శిశువులకు నస్రల్లా పేరు
లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా చనిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తమ దేశంలోని 100 మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టుకున్నట్లు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.