Telugu Global
International

పైల‌ట్ సీటులో తాచుపాము.. - భ‌యాందోళ‌న‌కు గురైన ప్ర‌యాణికులు

మొత్తం న‌లుగురు ప్ర‌యాణికుల‌తో వెళుతున్న చిన్న విమానం అది. ద‌క్షిణాఫ్రికాలోని వోర్స‌స్ట‌ర్ నుంచి నెల్స్‌ప్రుట్‌కు వెళ్తుతున్నారు. ఈ క్ర‌మంలో పైల‌ట్ సీటు వ‌ద్ద పాము క‌న‌బ‌డ‌టం అంద‌రిలోనూ క‌ల‌క‌లం రేపింది.

పైల‌ట్ సీటులో తాచుపాము.. - భ‌యాందోళ‌న‌కు గురైన ప్ర‌యాణికులు
X

ఆ విమానం ప‌దివేల అడుగులకు పైగా ఎత్తులో ప్ర‌యాణిస్తోంది. విమానాన్ని న‌డుపుతున్న పైల‌ట్‌కి త‌న న‌డుము వ‌ద్ద చ‌ల్ల‌గా త‌గిలిన‌ట్టు అనిపించింది. వాట‌ర్ బాటిల్ అయ్యుంటుంద‌ని అనుకున్నాడు. కొద్దిసేప‌టి త‌ర్వాత ప‌క్క‌కు చూస్తే తాచుపాము క‌నిపించింది. ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. తొలుత ఏం చేయాలో అర్థం కాలేదు. అనంత‌రం త‌ప్పనిస‌రై ప్ర‌యాణికుల‌కు తెలియ‌జేశాడు. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

మొత్తం న‌లుగురు ప్ర‌యాణికుల‌తో వెళుతున్న చిన్న విమానం అది. ద‌క్షిణాఫ్రికాలోని వోర్స‌స్ట‌ర్ నుంచి నెల్స్‌ప్రుట్‌కు వెళ్తుతున్నారు. ఈ క్ర‌మంలో పైల‌ట్ సీటు వ‌ద్ద పాము క‌న‌బ‌డ‌టం అంద‌రిలోనూ క‌ల‌క‌లం రేపింది. అయినా పైల‌ట్ భ‌య‌ప‌డ‌కుండా.. కంట్రోల్ రూమ్‌కు స‌మాచారం అందించాడు. వెంట‌నే వారు జోహాన్నెస్‌బ‌ర్గ్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కి అవ‌కాశ‌మిచ్చారు. దీంతో సుర‌క్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైల‌ట్‌. అనంత‌రం కాక్‌పిట్‌లో ప‌రిశీలించిన సిబ్బందికి పైల‌ట్ సీటును ప‌క్క‌కు జ‌ర‌ప‌గా అక్క‌డ చుట్టచుట్టుకొని పాము క‌నిపించింది. అంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిలోనూ విమానాన్ని సుర‌క్షితంగా న‌డిపిన పైల‌ట్ రుడాల్ఫ్ ఎరాస్మ‌స్.. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.

పాము ఉంద‌ని ముందే గుర్తించినా..

సోమ‌వారం ఉద‌యం జ‌రిగిన ఈ ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. వాస్త‌వానికి విమానం బ‌య‌ల్దేరేముందు జ‌రిపే ప‌రిశీల‌న‌లోనే సిబ్బందికి పాము క‌నిపించింది. విమానం రెక్క‌ల్లో పాము ఉండ‌టాన్ని గుర్తించిన సిబ్బంది.. వెంట‌నే దానిని ప‌ట్టుకునేందుకు హెల్ప‌ర్ల‌ను పిలిపించారు. అయితే వారు వ‌చ్చి ఎంత‌ వెతికినా పాము క‌నిపించ‌లేదు. దీంతో బ‌య‌టికి వెళ్లిపోయి ఉంటుంద‌ని సిబ్బంది భావించారు.

కాక్‌పిట్‌లో పామును గుర్తించిన పైల‌ట్‌.. జోహాన్నెస్‌బ‌ర్గ్‌లో విమానాన్ని ల్యాండింగ్ చేసిన త‌ర్వాత అక్క‌డి సిబ్బంది పాము కోసం వెత‌క‌గా, ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో క‌థ మ‌ళ్లీ మొదటికొచ్చింది. ఈ నేప‌థ్యంలో పైల‌ట్ సీటును ప‌క్క‌కు జ‌రిపి చూడ‌గా.. అక్క‌డ పాము చుట్టచుట్టుకొని క‌నిపించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  7 April 2023 8:54 AM IST
Next Story