సిన్వర్ హత్యతో ప్రతిఘటన స్ఫూర్తి బలోపేతం
హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ మరణవార్త తెలిసిన కొన్నిగంటల్లోనే ప్రతిఘటన బలోపేతమౌతుందని ఐక్యరాజ్యసమితికి తెలిపిన ఇరాన్ మిషన్
సిన్వర్ హత్యతో ప్రతిఘటన స్ఫూర్తి బలోపేతమౌతుందని ఇరాన్ పేర్కొన్నది. హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ మరణవార్త తెలిసిన కొన్నిగంటల్లోనే ప్రతిఘటన బలోపేతమౌతుందని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ మిషన్ తెలిపింది. పాలస్థీనా విముక్తి కోసం యువత, చిన్నారులు అతని బాటలో నడుస్తారు. ఆక్రమణ, శతృత్వ ధోరణి ఉన్నంత కాలం ప్రతిఘటన కొనసాగుతుంది. అమరులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. మరోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామని హెజ్‌బొల్లా ప్రకటించింది. హమాస్ అగ్రనేత సిన్వర్ మృతి నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
సిన్వర్ స్థానాన్ని ఆక్రమించేదెవరు?
ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ హతమైన తర్వాత ఆ బాధ్యతలు ఎవరు చేపడుతారనే చర్చ జరుగుతుతున్నది. రెండు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైళ్లలో గడిపిన సిన్వన్ తర్వాత ముఖ్యనేతగా ఎదిగాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఆ బాధ్యతలను హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకవరైన మహమ్మద్ అల్ జహర్ స్వీకరించే అవకాశం ఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యుడు మౌసా అబు మార్జౌక్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు యాహ్యా సిన్వర్ మరణం తర్వాత అతని సోదరుడు మహమ్మద్, ఇతర మిలటరీ కమాండర్ల జాడ కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నామని ఐడీఎఫ్ తెలిపింది. హమాస్‌ను పూర్తిగా అంతం చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
గాజా యుద్ధం ముగింపు ఇప్పుడే ప్రారంభం: నెతన్యాహు
గాజా యుద్ధం ముగింపు ఇప్పుడే ప్రారంభమైందని సిన్వర్ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ధైర్యవంతులైన ఇజ్రాయెల్ సైనికులు అతడిని రఫాలో హతమార్చారని వెల్లడించారు. దీంతో గాజాలో యుద్ధం అంతం కాలేదని, ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.