Telugu Global
International

ట్విట్టర్ కు తాను సీఈవో గా ఉండాలా వద్దా ? - పోల్ పెట్టిన ఎలాన్ మ‌స్క్

తాను ట్విట్టర్ సీఈవో గా ఉండాలా వద్దా అని ట్విట్టర్ వినియోగదారులకు ఎలాన్ మ‌స్క్ ఓ పరీక్ష పెట్టాడు. పోస్ట్ చేసిన ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు.

ట్విట్టర్ కు తాను సీఈవో గా ఉండాలా వద్దా ? - పోల్ పెట్టిన ఎలాన్ మ‌స్క్
X

ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల‌పై ట్విట్టర్ యూజర్లతో సహా, అన్ని వైపుల నుండి మస్క్ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో తాను ట్విట్టర్ సీఈవో గా ఉండాలా వద్దా అని ట్విట్టర్ వినియోగదారులకు ఓ పరీక్ష పెట్టాడు. పోస్ట్ చేసిన ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. ఆయన మరో ట్వీట్ లో, ''గతంలో తీసుకున్న నిర్ణయాలకు క్షమాపణలు చెప్తున్నాను. మళ్ళీ అలా ఎప్పటికీ జరగదు. ఇకపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పోల్ పెడతాను'' అని ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో, ''మీరు ఏది పొందాలని కోరుకుంటారో అదే పొందుతారు. కాబట్టి కోరుకునేప్పుడు జాగ్రత్తగా ఆలోచించి కోరుకోండి'' అని అన్నారు. దీన్ని బట్టి తన సీఈవో పదవిపై ఓటు వేసేప్పుడు ఆలోచించి వేయమని పరోక్షంగా చెప్పాడని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఆ పోల్ సమయం మరో అరగంటలో ముగిసి పోనుంది. ఇప్పటి వరకు మస్క్ సీఈవోగా ఉండాలని 42.5 శాతం మంది, అతను వైదొలగాలని 57.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో అరగంటలో ఈ అభిప్రాయాల్లో పెద్దగా తేడా రాకపోవచ్చు. దీన్ని బట్టి ఎక్కువ మంది ట్వీట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్ ఉండకూడదని అభిప్రాయ‌పడుతూ ఉండటం ఆయనకు పెద్ద షాకే.

ట్విట్టర్ ఖాతాలను మస్క్ తాత్కాలికం నిలిపి వేశాడు. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

చివరకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా మస్క్ చర్యలను ఖండించారు. ''ట్విట్టర్‌లో పలువురు జర్నలిస్టుల ఖాతాలను ఏకపక్షంగా నిలిపివేయడం పై మేము చాలా కలవరపడ్డాము'' అని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.

ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ పోల్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.


First Published:  19 Dec 2022 4:27 PM IST
Next Story