Telugu Global
International

కెనడాలో గ్యాంగ్ వార్.. ఇద్దరు భారతీయుల కాల్చివేత

కెనడాలో గ్యాంగ్ వార్ లు, హత్యలు పెరిగిపోతున్నాయి. అందులో భారతీయులు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. వాంకూవర్ లో ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్ పై జరిపిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

కెనడాలో గ్యాంగ్ వార్.. ఇద్దరు భారతీయుల కాల్చివేత
X

కెనడాలోని వాంకూవర్ లో జరిగిన గ్యాంగ్ వార్ లో ఇద్దరు భారతీయులను దుండగులు కాల్చి చంపారు. పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ మనీందర్ ధలివాల్, అతని స్నేహితుడు సతీందర్ గిల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పట్టపగలు జరిగిన ఈ కాల్పులతో వాంకూవర్ లోని లాంగ్లే ప్రాంతం భీతావహంగా మారింది. 29 ఏళ్ళ మనీందర్ గిల్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన సతీందర్ గిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గ్యాంగ్ స్టర్లతో ఇతనికి ఏ సంబంధం లేకపోయినా .. ప్రత్యర్థి ముఠాల కాల్పుల్లో మరణించాడని పోలీసులు తెలిపారు. పంజాబ్ కు చెందిన మనీందర్ ధలివాల్ కి, కెనడాలోని ఇతర‌ ముఠాలకు మధ్య చాలాకాలంగా కక్షలు ఉన్నాయని వారు చెప్పారు. వాంకూవర్ లో 'బ్రదర్స్ కీపర్స్ గ్యాంగ్' పేరిట గల ముఠాలో మనీందర్ సభ్యుడని, ఈ ముఠాతో బాటు 'యునైటెడ్ నేషన్స్ గ్యాంగ్', 'రెడ్ స్కార్పియన్స్ గ్యాంగ్' అనే మరో రెండు ముఠాల మధ్య తీవ్రమైన కక్షలున్నాయని వారు చెప్పారు. ఘటనా స్థలంలో ఓ వాహనం మంటల్లో మండుతూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఈ నెల 14 న యునైటెడ్ నేషన్స్ గ్యాంగ్ లోని క్రిస్ ఇర్విన్ హత్యకు గురి కావడంతో బహుశా ఈ ముఠా సభ్యులే ప్రతీకారంగా మనీందర్, సతీందర్ పై కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. నిజానికి మనీందర్, అతని సోదరుడు బరీందర్ తో బాటు మరో ఆరుగురు ప్రమాదకరమైన వ్యక్తులని, ప్రజలు వీరి నుంచి దూరంగా ఉండాలంటూ లోగడ వాంకూవర్ పోలీసులు వీరి పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ ముఠాల మధ్య కక్షలు అమాయక ప్రజలను కూడా బలి తీసుకోవచ్ఛునని వారు హెచ్చరించారు. ధలివాల్ రెండో సోదరుడిని గత ఏడాది ఏప్రిల్ లో కాల్చి చంపిన ఘటనను వీరు గుర్తు చేస్తున్నారు. ఆ సందర్భంలో మనీందర్ దుండగులను కొంతదూరం వెంబడించి షూటర్ కంటిలో పొడిచాడట.. తాజా ఘటనలో ఇద్దరి మృత దేహాలు రక్తపు మడుగులో ఉన్న దృశ్యాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో మరో సంఘటనలో నిన్న ఉదయం తన గన్ తో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని, మరో ఇద్దరినీ గాయపరిచాడని వార్తలందాయి. పోలీసుల కాల్పుల్లో ఆ దుండగుడు మృతి చెందినట్టు ఈ వార్తలు పేర్కొన్నాయి. . ఈ షూటర్ ని జోర్డాన్ డేనియల్ గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ వాహనం బుల్లెట్ రంధ్రాలతో నిండిపోయి ఉన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. లాంగ్లే సిటీలో నిన్న అయిదు చోట్ల కాల్పుల ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు ఎమర్జెన్సీ అలర్ట్ వార్నింగ్స్ జారీ చేశారు. సుమారు 10 రోజుల క్రితమే ఎయిరిండియా విమానం పేల్చివేత ఘటనలో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ కూడా హత్యకు గురయ్యాడు. ఈ కాల్చివేత ఘటనలతో వాంకూవర్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.





First Published:  26 July 2022 11:03 AM IST
Next Story