Telugu Global
International

బంగ్లా ప్రధాని హసీనా రాజీనామా.. దేశం విడిచి పరారీ

షేక్ హసీనా నాలుగుసార్లు బంగ్లా ప్రధానిగా సేవలందించారు. 1996లో తొలిసారిగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన హసీనా.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డులకెక్కారు.

బంగ్లా ప్రధాని హసీనా రాజీనామా.. దేశం విడిచి పరారీ
X

బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఆర్మీ హెచ్చరికతో ఇప్పటికే ఢాకాలోని ప్రధానమంత్రి నివాసమైన ఘనభవన్‌ విడిచి సోదరితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు సమాచారం. హసీనా లండన్ పారిపోతున్నారని సమాచారం. హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో సైనిక పాలన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. ప్రధాని నివాసంలో విధ్వంసం సృష్టించారు. బంగ్లా తొలి ప్రధాని, షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహ్మాన్ విగ్రహాలను దేశవ్యాప్తంగా ధ్వంసం చేస్తున్నారు.


ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఆందోళన కారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ హసీనా చేసిన కామెంట్స్‌ మరింత ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇక అల్లర్ల కారణంగా నిన్న ఒక్క రోజే 98 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా అల్లర్లలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

షేక్ హసీనా నాలుగుసార్లు బంగ్లా ప్రధానిగా సేవలందించారు. 1996లో తొలిసారిగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన హసీనా.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డులకెక్కారు. 2009 నుంచి బంగ్లా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లోనూ హసీనా విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బాయ్‌కాట్ చేసింది.

First Published:  5 Aug 2024 4:00 PM IST
Next Story